45 ఏళ్లలోపు ఉన్నా వ్యాక్సిన్‌ | Anilkumar Singhal comments about Covid Vaccine Distribution | Sakshi
Sakshi News home page

45 ఏళ్లలోపు ఉన్నా వ్యాక్సిన్‌

Jun 3 2021 4:37 AM | Updated on Jun 3 2021 5:16 PM

Anilkumar Singhal comments about Covid Vaccine‌ Distribution - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్ల పైన వయసు ఉన్న వారికే టీకా వేస్తున్నామని, అయితే ఉద్యోగాలు లేదా చదువులకు విదేశాలకు వెళ్లే వారికి 45 ఏళ్లలోపు వయసు ఉన్నా టీకా వేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ చెప్పారు. చాలా దేశాలు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారినే అనుమతిస్తున్నాయని పలువురు తమ దృష్టికి తేవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆయన బుధవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్‌ నంబర్‌ కూడా అడుగుతున్నాయని, ఇప్పటికే ఎవరైనా మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసుకు వెళితే పాస్‌పోర్ట్‌ నంబర్‌ను చేర్చి వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేలా కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ను మార్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాశామని చెప్పారు. ఆధార్‌తో పాటు పాస్‌పోర్ట్‌ నంబరును విధిగా ఇవ్వాలన్నారు.

సీనియర్‌ రెసిడెంట్‌లకు స్టైఫండ్‌ను రూ.45 వేల నుంచి రూ.70 వేలకు పెంచామని, మిగతా సమస్యలను వారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. దీనిపై బుధవారం చీఫ్‌ సెక్రటరీ వద్ద చర్చలు జరిగాయని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కరోనా సమయంలో విధులు బహిష్కరించడం మంచిది కాదని చెప్పామన్నారు.

జూన్‌ 1 నాటికి రాష్ట్రంలో 1,01,68,254 డోసుల టీకా వేశామన్నారు. 45 ఏళ్లు నిండినవారు 1,33,07,889 మంది రిజిష్టర్‌ చేసుకోగా 61,76,447 మందికి (46.41 శాతం) వేశామన్నారు. జూన్‌లో కేంద్రం నుంచి రావాల్సిన 8,76,870 డోసులు వస్తేనే వ్యాక్సిన్‌ వేయడానికి ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. పడకల లభ్యత పెరిగిందని, ప్రతి జిల్లాలోను ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒకదశలో ఆక్సిజన్‌ రోజుకు 800 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశామని, ఇప్పుడు 490 మెట్రిక్‌ టన్నులు తీసుకొస్తున్నామని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement