ప్రకృతి సేద్యంలో ఏపీ ఫస్ట్‌  | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యంలో ఏపీ ఫస్ట్‌ 

Published Sun, Nov 6 2022 3:50 AM

Andhra Pradesh Tops in nature cultivation - Sakshi

ప్రకృతి వ్యవసాయం 17 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 16.78 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 6.30 లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే (2.90 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తుండగా.. గుజరాత్‌లో 2.49 లక్షల మంది రైతులు (అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో ‘జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం’ సారథ్య సంఘం మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తోమర్‌ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్‌ను ప్రారంభించారు.

ప్రకృతి సేద్య విస్తరణ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం ఉపయోగించి రసాయన రహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర శాఖలతో సమన్వయం చేసుకుని మార్కెట్లను అనుసంధానించాలని అధికారులను కోరారు.

తద్వారా, రైతులు తమ ఉత్పత్తులను మరింత సులభంగా విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తదితరులు హాజరయ్యారు. ఈ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది.

ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలను తెలిపే ఈ పోర్టల్‌ దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు.

2021 డిసెంబర్‌ తర్వాత 17 రాష్ట్రాల్లో 4.78 లక్షల హెక్టార్లకు పైగా అదనపు వ్యవసాయ భూములను ప్రకృతి సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు మంత్రి తోమర్‌ వెల్లడించారు. గంగా నది ఒడ్డున నాలుగు రాష్ట్రాల్లో 1.48 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరుగుతున్నట్లు తెలిపారు.     
– సాక్షి, సాగుబడి డెస్క్‌   

Advertisement
Advertisement