వైఎస్సార్‌ ఏపీ వన్‌.. పరిశ్రమలకు దన్ను | Andhra Pradesh New Industrial Policy Released To Keep State Number One | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఏపీ వన్‌.. పరిశ్రమలకు దన్ను

Aug 11 2020 4:10 AM | Updated on Aug 11 2020 12:17 PM

Andhra Pradesh New Industrial Policy Released To Keep State Number One - Sakshi

సాక్షి, అమరావతి: ఓ పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన మొదలు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా జీవితకాలం అండగా నిలిచే విధంగా దేశంలోనే తొలిసారిగా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి నష్టభయం లేకుండా హ్యాండ్‌ హోల్డింగ్‌ కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ను పొందుపరిచారు. మహిళా సాధికారితలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు నెలకొల్పే పరిశ్రమలకు అధిక రాయితీలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానం రూపొందింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా రంగాలవారీగా క్లస్టర్ల విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల యజమానులకు నిర్వహణ వ్యయం బాగా తగ్గేవిధంగా నూతన విధానం అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఎస్‌సీలకు 16.2 శాతం, ఎస్‌టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించారు. సోమవారం ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సుబ్రమణ్యం జవ్వాది తదితరులు ఇందులో పాల్గొన్నారు.

 వైఎస్‌ఆర్‌ ఏపీ వన్‌లో 10 కీలక సేవలు..
– వైఎస్‌ఆర్‌ ఏపీ వన్‌ ద్వారా 10 కీలక సేవలను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అందించనుంది. ఇందుకోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఫెసిలిటేషన్‌ సెల్, మార్కెట్‌ రీసెర్చ్‌ సెల్, మార్కెటింగ్‌ అండ్‌ బ్రాండింగ్‌ సెల్, సేల్స్‌ సపోర్ట్‌ సెల్, స్కీం సపోర్ట్‌ సెల్, ఎంఎస్‌ఎంఈ రీవిటలైజేషన్‌ స్కీం, బిజినెస్‌ ఏనేబుల్‌మెంట్‌ సెల్, ఇన్వెస్టర్‌ రీచ్‌ ఔట్‌ సెల్, ఇన్సెంటివ్‌ మేనేజ్‌మెంట్‌ సెల్, స్పెషల్‌ కేటగిరీ సెల్‌ ఏర్పాటు చేసింది.

తగ్గనున్న పెట్టుబడి వ్యయం
– ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడి వ్యయం చాలా తక్కువయ్యే విధంగా అన్ని మౌలిక వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులను క్లస్టర్ల విధానంలో అభివృద్ధి చేయనున్నారు. స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని రంగాలవారీగా పారిశ్రామిక క్లస్టర్లు, పార్కులు అభివృద్ధి చేయనున్నారు. బొమ్మల తయారీ, ఫర్నిచర్, ఫుట్‌వేర్‌లెదర్, మెషినరీ, ఏయిరోస్పేస్, డిఫెన్స్‌ వంటి రంగాల పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. 

డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌
– రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య, వారికున్న నైపుణ్యాలు, రాష్ట్రంలో ఉన్న యూనిట్లకు ఎంత మంది ఉద్యోగులు అవసరం? తదితర వివరాలన్నీ ఒకేచోట లభించేలా డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు స్కిల్డ్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు. 

ప్రాంతీయాభివృద్ధికి దోహదం చేస్తుంది 
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా పాలసీని రూపొందించారు. ఎంఎస్‌ఎంఈ, మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద పీట వేశారు. పెట్టుబడి వ్యయం తగ్గేవిధంగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పాలసీ వల్ల ఏయిరోస్పేస్, రక్షణ, ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రో కెమికల్స్‌ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశముంది.   
 – డి.రామకృష్ణ, చైర్మన్, సీఐఐ, ఏపీ చాప్టర్‌  

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ 
పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దే విధంగా నూతన పాలసీ ఉంది. మౌలిక వసతులు కల్పించడంతో పాటు పాత, కొత్త పరిశ్రమల సమస్యలను పరిష్కరించడానికి వైఎస్‌ఆర్‌ ఏపీ వన్‌ ప్రవేశపెట్టడం పెద్ద ఊరట. స్టార్టప్స్‌కి, ఎంఎస్‌ఎంఈలు తక్కువ పెట్టుబడి వ్యయంతో యూనిట్లు ప్రారంభించే అవకాశం ఏర్పడింది.     – సి.వి.అచ్యుతరావు, ప్రెసిడెంట్, ఫ్యాప్సీ 

లాక్‌డౌన్‌కు అనుగుణంగా పాలసీ 
కోవిడ్‌–19తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే విధంగా 2020–23 పారిశ్రామిక పాలసీని తీర్చిదిద్దారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనంలోకి తీసుకొని ఇవ్వగలిగిన హామీలనే పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి పెద్ద పీట వేయడం సంతోషంగా ఉంది.   
 – ఏపీకే రెడ్డి, ప్రెసిడెంట్, ఎఫ్‌ఎస్‌ఎంఈ   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement