
సాక్షి, అమరావతి: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పంచదార ఉత్పత్తికంటే అధికాదాయాన్నిచ్చే బయో ఇథనాల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటోంది. తద్వారా చెరకు రైతులను అన్ని విధాలా ఆదుకోనుంది.
తొలి దశలో అనకాపల్లి జిల్లా చోడవరంలోని చోడవరం సహకార సంఘ చక్కెర కర్మాగారంలో గ్రీన్ ఫీల్డ్ బయో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రోజుకు 60 కిలోలీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేలా ఈ యూనిట్ ఏర్పాటుకానుంది. చోడవరం చక్కెర కర్మాగారంలో బయో ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేయగా.. జూలై 10న అనుమతులు మంజూరు చేసి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను పంపాల్సిందిగా కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది.
ప్రాజెక్టు ఎంత వ్యయం అవుతుంది.. ముడిపదార్థాలు ఎంత అవసరం.. ఆదాయం.. రుణం ఎంత కాలంలో తీర్చగలం? వంటి అన్ని అంశాలతో ఈ నివేదికను తయారు చేయాల్సిందిగా కోరింది. ఆసక్తి గల సంస్థలు ఆగస్టు 28లోగా దాఖలు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని కలిపి వినియోగించుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటికే లీటరు పెట్రోలో 10 శాతం ఇథనాల్ కలుపుతుండగా, ఈ మొత్తాన్ని 2025–26 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఆ మేరకు మిగులు ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(ఈబీపీ) పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం బయో ఇథనాల్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించేలా ప్రత్యేకంగా ఓ పాలసీనే తీసుకొచ్చింది. ఇప్పుడు సహకార చక్కెర కర్మాగారాల్లో కూడా బయో ఇథనాల్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా వాటిని ఆర్థికంగా పరిపుష్టి చేయనుంది.