ఏపీలో విద్య దేశానికే ఆదర్శం

Andhra Pradesh education policy  Is An Ideal For The Country - Sakshi

సాక్షి, అమరావతి : నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, విద్యా కానుక, నూతన విధానాల్లో బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని విద్యా విధానం దేశానికే ఆదర్శం అని విద్యా రంగం నిపుణులు   కొనియాడారు. ‘75 వసంతాల స్వరాజ్యంలో విద్యా సంస్కరణలు– ఆంధ్రప్రదేశ్‌’ అనే అంశంపై పీపుల్స్‌ మీడియా ఆధ్వర్యంలో శనివారం మేధావుల వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. పలువురు మేధావులు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గడిచిన రెండేళ్లలో విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయన్నారు. నాడు – నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా.. ఇంగ్లిష్‌ మీడియం, కార్పొరేట్‌ తరహా క్లాసు రూములతో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు బా టలు వేశారని చెప్పారు.

మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాలయాల్లో కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తుండటం మంచి పరిణామం అని ప్రశంసించారు. అమ్మ ఒడి, విద్యా కానుకతో ఎంతో సామాజిక ప్రయోజనం ఉందని విశ్లేషించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రభుత్వ స్కూల్స్‌ ప్రారంభం కానున్న తరుణంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థకు సంబంధించి పలువురు విద్యావేత్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని సమావేశ సమన్వయకర్త, ఎరుక పత్రిక సంపాదకులు జి.ఆంజనేయులు వివరించారు. ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు పి.విజయప్రకాష్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్, హయ్యర్‌ ఎడ్యుకేషన్లకు రెండు కమిషన్‌లు తేవడం మంచి పరిణామమన్నారు. ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌ ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతోందన్నారు.

ఒక్క ఏడాదిలోనే రూ.25,714 కోట్లు
2014– 2019 మధ్య 5.62 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్‌గా మారితే, గత రెండేళ్లుగా 6.63 లక్షల మంది  ప్రభుత్వ స్కూళ్లలో కొత్తగా చేరారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్‌ చాన్సలర్‌ బాలమోహన్‌ దాస్‌ తెలిపారు. విద్య కోసం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రూ. 25,714 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 1,60,75, 373 మంది లబ్ధిదారులకు లాభం చేకూరిందని, 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్లు వారి ఖాతాలలోకి నేరుగా వేశారన్నారు.  నీతి అ యోగ్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2016 – 2018 మధ్య కాలంలో దాదాపు ఆరువేల స్కూల్స్‌ మూతపడ్డాయని బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఎన్‌.వెంకట్రావు తెలిపారు. సీఎం జగన్‌ గొప్ప ఆలోచన తీరు వల్ల నేడు ఆ పరిస్థితి మారి, మూత పడ్డ స్కూల్స్‌ తెరుచుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో పిల్లలు పరుగెత్తుకుంటూ స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ విశ్రాంత వైస్‌ చాన్సలర్‌ ముత్యాలనాయుడు పేర్కొన్నారు.

సీఎం జగన్‌ లక్ష్యం ఎంతో ఉపయుక్తం 
సోషల్‌ జస్టిస్, సమానత్వం అనేది విద్యతోనే సాధ్యం అని, వైఎస్‌ జగన్‌ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత వైస్‌ చాన్సలర్‌ వై.హరగోపాల్‌ రెడ్డి ప్రశంసించారు. ఈ పరిణామం మంచి విజ్ఞానవంతులను, మంచి పౌరులను అందించి మంచి సమాజాన్ని తయారు చేస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీ వర్గాలకు ఆంగ్ల మీడియం అందుబాటులోకి తెచ్చి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం జగన్‌దే అని రాయలసీమ యూనివర్శిటీ విశ్రాంత 
వైస్‌ చాన్సలర్‌  కె.కృష్ణ నాయక్‌ కొనియాడారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top