ఠంఛనుగా తప్పుడు రాతలు! | Andhra Pradesh: 90 Percent of People Get Pensions on The First Day of Every Month | Sakshi
Sakshi News home page

ఠంఛనుగా తప్పుడు రాతలు!

Apr 19 2022 4:36 PM | Updated on Apr 19 2022 4:43 PM

Andhra Pradesh: 90 Percent of People Get Pensions on The First Day of Every Month - Sakshi

అంతా ఠంచన్‌గానే!! బురద జల్లటం గానీ... ఒక పద్ధతిలో అబద్ధాలు ప్రచారం చేయటంలో గానీ ‘ఈనాడు’ను మించిన వాళ్లెవరూ లేరనే అనుకోవాలి.

అంతా ఠంచన్‌గానే!! బురద జల్లటం గానీ... ఒక పద్ధతిలో అబద్ధాలు ప్రచారం చేయటంలో గానీ ‘ఈనాడు’ను మించిన వాళ్లెవరూ లేరనే అనుకోవాలి. సెలవు రోజైనా... పండగ రోజైనా పట్టించుకోకుండా వలంటీర్ల సైన్యం ప్రతినెలా ఒకటవ తేదీనే ఫించను దారుల్ని ఇళ్లకు వెళ్లి మరీ పెంచిన పింఛను డబ్బులతో పలకరిస్తోంది. 90 శాతం మందికి ఒకటో తేదీనే పింఛను అందుతోంది. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు కనిపించవు. ఇప్పుడు ఇలా ఠంచనుగా చెల్లిస్తున్న విషయాన్ని గానీ... చంద్రబాబు హయాంలో 5వ తేదీదాకా అసలు పంపిణీయే మొదలుపెట్టనప్పుడు కానీ ఆయన పత్రికలో ఎలాంటి వార్తలూ ఉండవు. మరిప్పుడు ‘ఠంఛన్‌ తప్పిన పింఛను’ లాంటి రాతలెందుకు పెరుగుతున్నాయో తెలుసా? ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నది వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి. ఎంతెంత విషప్రచారం చేసినా ఆయన మనోబలం ఇసుమంత కూడా చెదరటం లేదు మరి!!. 

బాబు హయాం... గుర్తులేదా రామోజీ?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పెన్షన్లంటేనే ఓ ప్రహసనం. నడవ లేని అవ్వాతాతలు కూడా చచ్చీ చెడీ పింఛను డబ్బులు కోసం ప్రతి నెలా గ్రామాల్లోని పంచాయతీ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఎప్పుడిస్తారో తెలియదు కనక రోజుల తరబడి వెళుతూ పడిగాపులు కాయాల్సి వచ్చేది. అసలు 2014–2019 మధ్య ఏ ఊళ్లో ఎప్పుడు పింఛను పంపిణీ చేస్తారో తెలిస్తే ఒట్టు!. గ్రామ కార్యదర్శులు నెలలో ఏదో ఒక రోజు వచ్చి పంపిణీ చేసి  ళ్లేవారు. అదెప్పుడో తెలియక అవ్వాతాతలు ఒకటో తేదీ నుంచి ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో పడిగాపులుగాసి చివరకు ఊసూరు మంటూ వెళ్లేవారు. ఈ పింఛన్ల పంపిణీ ఎంతలా సాగే... దంటే కొన్ని నెలల్లో ఏకంగా 19–24 రోజుల పాటు పంపిణీ చేస్తూనే ఉండేవారు. 2017 ఏప్రిల్‌లో 21 రోజుల పాటు పింఛన్ల పంపిణీ సాగితే, అదే ఏడాది జులైలో 24 రోజులు, 2018 ఏప్రిల్, జూన్‌ నెలలో 19 రోజులు కొనసాగిందీ ప్రహసనం. విచిత్రమేంటంటే అద్దాల్లోంచి చూసే రామోజీకి జనం ఇబ్బందులేవీ కనిపించనేలేదు. అవ్వాతాతల కష్టాలుపడే ఫోటోలకు ‘ఈనాడు’లో చోటు దక్కితే ఒట్టు. అదే మరి ‘‘మన’’ మార్కు జర్నలిజమంటే!!.

కొత్తవే కాదు... ఉన్నవాళ్లకూ ఎగ్గొట్టుడే!!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ప్రతి నెలా లబ్ధిదారులందరికీ పింఛను అందటమనేది కలే. 2018 ఫిబ్రవరిలో 44.06 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసినా... ఇచ్చింది మాత్రం 39 లక్షల మందికే. ఆ ఒక్కనెలే కాదు. ఐదేళ్ల పాటు ప్రతి నెలా నాలుగైదు లక్షల మందికి మొండి చెయ్యే. వారు మరుసటి నెల దాకా వేచి చూడాల్సిందే. పైపెచ్చు అప్పట్లో ప్రభుత్వం పింఛన్లపై చేసిన ఖర్చు నెలకు రూ.400 కోట్లు. అది కూడా ఒకేసారి కాకుండా రెండు మూడు విడతలుగా విడుదల చేసిన దుస్థితి. వీటికి తోడు ‘ఒకరు మరణిస్తే వారి స్థానంలో మరొకరికి పెన్షన్‌’ అనేలా ‘శాచ్యురేషన్‌’కు బాబు ఇచ్చిన నిర్వచనం తెలిస్తే మతితప్పడం ఖాయం. 2017–18 సంవత్సరాల్లో  పెన్షన్‌ కోసం వచ్చిన 4.35 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే ఇంకేం చెప్పాలి? కాకపోతే వీటిపై ఒక్క విమర్శా చేయకపోవటమనేదే రామోజీ మార్కు పాత్రికేయం. (చదవండి: నాడు జీవచ్ఛవం.. నేడు జీవనాడి..)

ఏప్రిల్‌ 1... ఎందరికిచ్చారో తెలుసా? 
అర్హులెవ్వరికీ... పింఛను రాలేదనే పరిస్థితి ఉండకూడదన్నది వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. అందుకే పింఛనుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పైపెచ్చు అవ్వాతాతలు పింఛన్ల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి లేకుండా జగన్‌ ఓ సేవా సైన్యాన్ని సృష్టించారు. 2020 ఫిబ్రవరి నుంచి ఈ సైన్యం లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లిచ్చే విప్లవానికి నాంది పలికింది. అప్పటి నుంచి పింఛనుదార్లకు ఒకటో తేదీ ఒక్కటి చాలు. ఈ ఏడాది జనవరిలో 61.74 లక్షల మందికి పింఛను మంజూరు చేస్తే, అందులో 61.64 లక్షల మందికి ఐదో తేదీలోగానే రూ.1555.49 కోట్ల మేర పంపిణీ జరిగింది. మొత్తం లబ్దిదారులలో 99.07 శాతం మందికి డబ్బులు చేరాయి. ఫిబ్రవరిలో 99.04 శాతానికి, మార్చిలో 99.13 శాతానికి 5వ తేదీలోగానే పంపిణీ పూర్తయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్‌ 1న బ్యాంకులకు సెలవు కావడం, 2న ఉగాది, 3న ఆదివారం... వరసగా సెలవులొచ్చినా ఏప్రిల్‌ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50.43 లక్షల మందికి అంటే 82.64  శాతం మందికి రూ. 1281 కోట్లు డబ్బులు పంపిణీ చేశారు. (చదవండి: జర్నలిజమా లేక అధికార పిచ్చా!)

10 శాతం మందికి... ఈ ఒక్క నెలలో...
4వ తేదీన వర్కింగ్‌ డే అయినా... 5న బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సెలవొచ్చింది. స్కూళ్లక్కూడా సెలవులు రావటంతో అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పలువురు లబ్దిదారులు కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు, బందువుల ఇళ్లకు వెళ్లడంతో మిగిలిన వారికి పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయి. వలంటీర్లు వెళ్లినా పలు చోట్ల లబ్దిదారులు అందుబాటులో లేక 4 సాయంత్రానికి 90.46 శాతం మందికే పింఛన్లందాయి. మిగిలిన వారికి కూడా అందజేయాలన్న ఉద్దేశంతో ఏప్రిల్‌ ఒక్క నెలలో మాత్రమే 11వ తేదీ వరకు పంపిణీని పొడిగించారు అధికారులు. ఆలోగా అందరికీ అందాయి కూడా. కాకపోతే రామోజీకిది నచ్చలేదు. ఆలస్యమైనా ఎందుకిచ్చారన్న తీరులో ‘ఠంచను’ తప్పారంటూ తప్పుడు రాతలకు దిగారు. నిజానికి గతంలో లబ్దిదారులు ఒక నెల పింఛను తీసుకోకపోయినా, మరుసటి నెలలో ఇచ్చేవారు. కానీ, హైదరాబాద్‌ సహా పొరుగు రాష్ట్రాల్లో శాశ్వత నివాసం ఉండే అనర్హులు కూడా పింఛన్లు పొందుతున్నారన్న ఉద్దేశంతో 2021 అక్టోబరు నుంచి ఏ నెల పింఛను ఆ నెలలోనే తీసుకోవాలన్న నిబంధన తెచ్చారు. పాపం.. అదీ నచ్చలేదు రామోజీకి. 
– సాక్షి, అమరావతి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement