
మాట్లాడుతున్న అనంత వెంకట్రామిరెడ్డి, పక్కన కేతిరెడ్డి
అనంత వెంకట్రామిరెడ్డి విమర్శ
మిథున్‌రెడ్డితో ములాఖత్
సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబునాయుడు అల్లిన కట్టుకథే లిక్కర్ కుంభకోణమని, ఆ కథ ఆధారంగానే సిట్ అధికారులు సరైన ఆధారాలు లేకపోయినా విచారణ చేస్తూ కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. లిక్కర్ అక్రమ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం సోమవారం ములాఖత్ అయ్యారు.
అనంతరం అనంత సెంట్రల్ జైల్ వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను అధైర్య పరచేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు. జైల్లో మిథున్‌రెడ్డికి అన్ని వసతులూ కల్పించాలని న్యాయస్థానం ఆదేశిస్తున్నా.. పాటించడం లేదన్నారు.
బాబును ఎదుర్కొన్నందుకే: కేతిరెడ్డి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో లేని స్కామ్‌ను తీసుకొచ్చి నిరాధారంగా ఎంపీ మిథున్‌రెడ్డిని జైల్లో ఉంచారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తన చిన్నాన్న పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు మూడు నెలల క్రితం కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలిచి్చనా వారు స్పందించలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ కడప నేత సుగవాసి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌ను నమ్మితే, పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కాపులకు అర్థమవుతోందన్నారు.