చంద్రబాబు ప్రభుత్వం తీరుపై పోరాటం
రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఇల్లెందు: ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతుందన్నట్టు..’ గా అమరావతి రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం తీరు అలా ఉందని రైతు ఉద్యమనేత వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరుగుతున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం (మాస్‌లైన్ అనుబంధం) జాతీయ మహాసభలు మంగళవారం రెండోరోజుకు చేరాయి. ఈ సభలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరిట ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి సేకరించిందని తెలిపారు.
ఆ భూమిలో రాజధాని నిర్మాణం చేపట్టకపోగా మరో 20 వేల ఎకరాలు ఇస్తే రాజధానిని నిర్మిస్తామని చెబుతుండడంపై ఎవరూ నమ్మలేని పరిస్థితి నెలకొందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాబోతోందన్నారు. దీన్ని కాపాడుతామని ఎన్నికల ముందు చెప్పిన నేతలు.. ఇప్పుడు మోదీ సర్కార్‌కు తలొగ్గి ఇష్టారాజ్యంగా కార్పొరేట్ సంస్ధలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కాగా, అమరావతిలో మరోమారు భూములు తీసుకునేందుకు సాగుతున్న యత్నాలపై తమతోపాటు కలిసి వచ్చే శక్తులతో పోరాటం సాగించనున్నట్టు శోభనాద్రీశ్వరరావు తెలిపారు.
తొలుత అఖిల భారత ఐక్య రైతు సంఘం సభల్లో ఆయన మాట్లాడుతూ దేశంలో మోదీ నేతృత్వాన ఫాసిస్టు పాలన సాగుతోందని, ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లోని కారి్మకుల మాదిరిగా రైతాంగం ఐక్యతను ప్రదర్శించకపోవడం వల్లే హక్కులు సాధించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోని రైతాంగాన్ని ఐక్యం చేసి బలమైన ఉద్యమాలు నిరి్మంచాలని ఆయన సూచించారు.


