రాజధాని కేసుల్లో విచారణ వాయిదా

Adjournment of trial in Andhra Pradesh capital cases - Sakshi

నవంబర్‌ 15న తదుపరి విచారణ

ఆ తర్వాత ఎలాంటి వాయిదాలకు ఆస్కారం ఉండదు

రోజూవారీ పద్ధతిలో విచారణకు సహకరించండి

న్యాయవాదులకు తేల్చిచెప్పిన హైకోర్టు ధర్మాసనం

సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్‌డీఏ రద్దు చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో పలువురి అభ్యర్థన మేరకు తదుపరి విచారణను నవంబర్‌ 15వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఆ తరువాత ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా రోజువారీ పద్ధతిలో విచారణ జరిగేందుకు సహకరించాలని ధర్మాసనం న్యాయవాదులకు తేల్చి చెప్పింది. న్యాయవాదుల వ్యక్తిగత కారణాలు ఏవైనప్పటికీ తదుపరి ఎలాంటి వాయిదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మాట్లాడుకుని ముందు ఎవరు వాదనలు ప్రారంభిస్తారో అందుకు సంబంధించి షెడ్యూల్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్‌ విధానంలోనే తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్‌డీఏ రద్దు చట్టాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

న్యాయవాదుల నుంచి భిన్న సూచనలు
ఈ వ్యాజ్యాల్లో విచారణను సెప్టెంబర్‌ చివరి వారానికి వాయిదా వేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ అందించామని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాందివాన్‌ తరఫున జూనియర్‌ న్యాయవాది సంజయ్‌ సూరనేని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విచారణను ఎప్పటికి వాయిదా వేయాలన్న దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. సెప్టెంబర్‌ చివరి వారానికి కోవిడ్‌ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయని, అక్టోబర్‌ మొదటి వారం నుంచి హైకోర్టుకు దసరా సెలవులు, ఆ తరువాత దీపావళి సెలవులు ఉంటాయని ఏజీ తెలిపారు.

ఈ వ్యాజ్యాల్లో నిరాటంకంగా వాదనలు జరగాల్సి ఉన్నందున విచారణను నవంబర్‌లో చేపట్టాలని కోరారు. దీనిపైనా న్యాయవాదులు భిన్న సూచనలు చేశారు. పిటిషనర్ల తరఫున హాజరైన సుప్రీంకోర్టు న్యాయవాది దేవదత్‌ కామత్‌ జోక్యం చేసుకుంటూ తదుపరి విచారణ సమయంలో ధర్మాసనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమలో తాము మాట్లాడుకుని ఎవరు ఏయే సమయంలో వాదనలు వినిపించాలో నిర్ణయించుకుని కోర్టుకు తెలియచేస్తామని ప్రతిపాదించారు. స్వాగతించిన ధర్మాసనం అత్యధికుల సూచన మేరకు తదుపరి విచారణను నవంబర్‌ 15కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top