పిల్‌ పెండింగ్‌లో ఉండగానే బాబు కేసును మూసేసిన ఏసీబీ కోర్టు | ACB court closes Chandrababu case while PIL is pending | Sakshi
Sakshi News home page

పిల్‌ పెండింగ్‌లో ఉండగానే బాబు కేసును మూసేసిన ఏసీబీ కోర్టు

Apr 10 2026 5:16 AM | Updated on Apr 10 2026 5:16 AM

ACB court closes Chandrababu case while PIL is pending

మద్యం కుంభకోణం కేసు మూసివేత తొందరపాటు నిర్ణయం 

హైకోర్టుకు నివేదించిన పిటిషనర్‌ 

తదుపరి విచారణ 17కు వాయిదా 

సాక్షి, అమరావతి: చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్‌ కొట్టి బాలగంగాధర తిలక్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే, ఏసీబీ కోర్టు తొందరపాటు నిర్ణయం తీసుకుందని న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పిల్‌ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసిందని ఆయన వివరించారు. 

పైపెచ్చు ఈ కేసు డాక్యుమెంట్లను కోరితే అందుకుసైతం ‘థర్డ్‌ పార్టీ పేరుతో’ ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్నారు. ఇదే తరహా వ్యాజ్యాలు ఇప్పటికే ఇదే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. పిటిషనర్‌ తిలక్‌కు చంద్రబాబుపై నమోదైన కేసులతో సంబంధం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇదే తరహా అంశాలపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. 

తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్‌ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశి్నస్తూ తిలక్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్‌ రిపోర్ట్, సీఆర్‌పీసీ 161 స్టేట్‌మెంట్లు, క్లోజ­ర్‌ రిపోర్ట్‌ సరి్టఫైడ్‌ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కో­ర్టును ఆదేశించాలని హైకోర్టును ఆయన అభ్యర్థించారు.   

Advertisement
 
Advertisement
Advertisement