ఉదయం నుంచే భగభగ.. తీవ్రమైన ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి.. 9 జిల్లాల్లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత

46 degrees is the highest temperature in 9 districts - Sakshi

మరో 10 జిల్లాల్లో 45 డిగ్రీలు.. ధవళేశ్వరంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 

ఎండబారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక 

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 6 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం 9 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు, మరో 10 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. 13 మండలాల్లో 46 డిగ్రీలు, 39 మండలాల్లో 45 డిగ్రీలు, 255 మండలాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్ర­తలు నమోదయ్యాయి.

40 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 148 మండలాల్లో వడగాడ్పు­లు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలి­పింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమో­దైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడులో 46.7 శ్రీకా­కుళం జిల్లా కొత్తూరులో 46.5 డిగ్రీల ఉ­ష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలు మండు­తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ కోరారు. ముఖ్యంగా వృద్ధు­లు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసు­కోవాలన్నారు. ప్రయాణాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
నేడు 20 మండలాల్లో వడగాడ్పులు 
బుధవారం 20 మండలాల్లో వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి జిల్లాలో 2 మండలాలు, గుంటూరు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో ఒకటి, ఎన్టీఆర్‌ జిల్లాలో 3, పల్నాడులో 3, వైఎస్సార్‌ జిల్లాలో 9 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

ఎన్టీఆర్, గుంటూ­రు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూ­రు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో   45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top