పొగాకు రైతుకు రూ.130 కోట్ల లబ్ధి | 130 Crore Benefited To Tobacco Farmer | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుకు రూ.130 కోట్ల లబ్ధి

Aug 31 2020 8:39 AM | Updated on Aug 31 2020 8:39 AM

130 Crore Benefited To Tobacco Farmer - Sakshi

సాక్షి, అమరావతి: పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వ్యాపారులతో పోటీపడి మార్క్‌ఫెడ్‌ పొగాకు కొనుగోలు చేస్తుండటంతో పంట ధర పెరుగుతోంది. దీంతో రైతుకు మంచి రేటు వస్తోంది. జూన్‌ నెలాఖరు వరకు ముప్పుతిప్పలు పెట్టిన వ్యాపారులు ప్రభుత్వ జోక్యంతో పంట కొనుగోలుకు ముందుకొస్తున్నారు.

అకాల వర్షాల కారణంగా తెగుళ్లు సోకి ఈ సీజనులో పొగాకు దిగుబడి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం టుబాకో బోర్డు ఆధ్వర్యంలో వేలం కేంద్రాలను ప్రారంభించినా కోవిడ్‌ కారణంగా ఎగుమతులు ఆగిపోవడంతో స్థానిక వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి చౌకగా కొనుగోళ్లకు ప్రయత్నించారు. 
కొందరు రైతులు లోగ్రేడ్‌ పొగాకును కిలో రూ.60 నుంచి రూ.70లోపే విక్రయించారు. ఇలా మూడు నెలల వ్యవధిలో రైతుల నుంచి 45 మిలియన్‌ కిలోల పొగాకును వ్యాపారులు కొనుగోలు చేశారు. నష్టపోతున్న పొగాకు రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పరిస్ధితి వివరించడంతో వెంటనే స్పందించి కొనుగోలు బాధ్యతను మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. 
జూలై మొదటి వారం నుంచి మార్క్‌ఫెడ్‌ అన్ని వేలం కేంద్రాల్లో వ్యాపారులతో పోటీపడి పొగాకు కొనుగోలు చేయడంతో ఇప్పటివరకు 49 మిలియన్‌ కిలోల పొగాకును రైతులు అమ్ముకోగలిగారు. ప్రభుత్వ జోక్యం కారణంగా కొన్ని రకాల పొగాకుకు కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు ధర పెరగడంతో రైతులు లబ్ధి పొందారు.

‘లోగ్రేడ్‌ పొగాకు ధర కిలో రూ.40 – రూ.50 లోపే పలకడంతో విక్రయించలేక ఇంటికి తెచ్చా. లారీ కిరాయిల కోసం రూ.వేలల్లో ఖర్చయింది. చివరి ఆశగా ముఖ్యమంత్రి జగన్‌ను కలసి  మా దుస్థితిని వివరించడంతో రెండు రోజుల్లోనే అధికారులతో సమావేశం నిర్వహించి పొగాకు రైతుకు అండగా నిర్ణయం తీసుకున్నారు. మార్క్‌ఫెడ్‌కు అధిక రేటుకు అమ్ముకుంటున్నాం. ఆ డబ్బుతో మళ్లీ సాగుకు సమాయత్తం అవుతున్నాం’
–రావూరి శ్రీకాంత్, కలిగిరి, నెల్లూరు జిల్లా.

‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో పొగాకు రైతులు రూ.130 కోట్ల వరకు లబ్ధి పొందనున్నారు. వ్యాపారులతో పోటీపడి మార్క్‌ఫెడ్‌ పొగాకు కొనుగోలు చేస్తుండటంతో ధరలు పెరిగాయి.  దేశంలో మొదటిసారిగా పొగాకు విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది
– మారెడ్డి సుబ్బారెడ్డి (ప్రకాశం జిల్లా వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement