ఊరేగింపులు | - | Sakshi
Sakshi News home page

ఊరేగింపులు

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

● ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో అమలులోకి నియమావళి

● షరతులు ఉల్లంఘిస్తే ఈసీ చర్యలు

అనంతపురం అర్బన్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలక, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. వెనువెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండెక్ట్‌)అమల్లోకి వచ్చింది. ప్రచారం నిర్వహించే రాజకీయ పక్షాలు, అభ్యర్థుల మార్గదర్శనం కోసం ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాలి. ఉల్లంఘన జరగకుండా ఎంసీసీ బృందాలు ప్రత్యేక దృష్టి సారిస్తాయి. సాధారణ ప్రవర్తన, సభలు, ఊరేగింపులు నిర్వహించడంలో నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.

సాధారణ ప్రవర్తన

●ఇదివరకే ఉన్న విబేధాలను మరింత పెంచేలా, పరస్పర ద్వేషాన్ని పెంచేలా, కులాలు, జాతుల మధ్య, మతపరమైన, భాషాపరమైన ఉద్రిక్తతలను కలిగించే ఏ రకమైన కార్యకలాపాలను ఏ పార్టీ కాని, అభ్యర్థులు గాని చేయరాదు.

●ఇతర రాజకీయ పక్షాలను విమర్శించే పక్షంలో అధికార విధానాలు, కార్యకలాపాలకు, పాత రికార్డుకు, పనికి మాత్రమే పరిమితమై ఉండాలి. ఇతర పార్టీల నాయకులు లేదా కార్యకర్తల వ్యక్తిగత జీవితపు అన్ని కోణాల విమర్శను పరిహరించాలి.

●ఓట్ల కోసం కులం, మతపరమైన భావాలపరంగా అభ్యర్థనలు చేయకూడదు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చిలు, దేవాలయాలు, మరే ఆరాధనా ప్రదేశాలను, పాఠశాలలను వేదికగా చేసుకోకూడదు.

●ఓటర్లకు లంచం ఇవ్వడం, బెదిరించడం, అసలు ఓటర్లకు బదులుగా వేరే వ్యక్తులను ఓటర్లుగా ఉపయోగించకూడదు. పోలింగ్‌ స్టేషన్లకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం, పోలింగ్‌ పూర్తవ్వడానికి నిర్ణయించిన సమయానికి ముందు 48 గంటల కాలంలో బహిరంగ సభలు నిర్వహించకూడదు. పోలింగ్‌ స్టేషన్‌కి ఓటర్లను తీసుకురావడం, తీసుకెళ్లడం వంటివి ఎన్నికల చట్ట పరిధిలో శిక్షింపతగిన చర్యలు.

●వ్యక్తుల అభిప్రాయాలు లేక కార్యక్రమలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వారి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం, వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించడం, పికెటింగ్‌ వంటివి చేయకూడదు.

●ప్రచారం కోసం జెండాలు కట్టడం, బ్యానర్‌ తగిలించడం, నోటీసులు అతికించడం, నినాదాలు రాయడం తదితర పనులకు ఏ వ్యక్తి భూమి, భవనం, ప్రహరీ గోడలను సదరు వ్యక్తి అనుమతి లేకుండా ఉపయోగించరాదు.

●ఇతర పారీలు నిర్వహించే ఊరేగింపులు, సమావేశాలను భగ్నం చేయడం, అడ్డంకులు సృష్టించడం వంటివి చేయకూడదు. వేరొక పార్టీ సమావేశంలో మౌఖికంగా లేదా రాతపూర్వకంగా ప్రశ్నలు వేయడం, తమ పార్టీ కరపత్రాలు పంచకూడదు. ఓ పార్టీ జారీ చేసిన పోస్టర్లను మరో పార్టీ వారు తొలగించరాదు.

సభల నిర్వహణ

●పార్టీ లేక అభ్యర్థి స్థానిక పోలీసు అధికారులకు తగినంత సమయం ఉండేలా ముందుగానే సభ నిర్వహించే ప్రదేశం, సమయాన్ని తెలియజేయాలి

●సభ ఏర్పాటు చేయాలనే ప్రదేశంలో ఇప్పటికే నిషేద్ధాత్మాక లేక నిర్బంధాత్మక ఆదేశాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. అమలులో ఉంటే కచ్చితంగా పాటించాలి. ఆదేశాల నుంచి మినహాయింపు కోరినట్లయితే, దాని కోసం అభ్యర్థన ముందుగానే పంపి మినహాయింపు పొందాలి.

●సభల్లో లౌడ్‌ స్పీకర్లు వినియోగించడానికి ముందుగానే సంబంధిత అధికారికి అభ్యర్థనను లిఖితపూర్వకంగా సమర్పించి అనుమతి తీసుకోవాలి.

●సమావేశాలు భగ్నం చేయడం లేదా మరో విధంగా శాంతికి భంగం కలిగే విధంగా ప్రయత్నిస్తే చర్యలు తప్పవు.

ఊరేగింపును నిర్వహించే పార్టీ లేదా అభ్యర్థి కార్యక్రమం ప్రారంభించే సమయం, ప్రదేశం, వెళ్లే మార్గం, ముగింపు సమయం, ప్రదేశం తదితర వివరాలను నిశ్చయం చేసుకోవాలి. దానిని అతిక్రమించరాదు.

కార్యక్రమం గురించి స్థానిక పోలీసు అధికారులకు నిర్వాహకులు ముందుగానే తెలియజేయాలి. ఊరేగింపు సాగే ప్రదేశాలలో ఏవైనా నిర్బంధాత్మక ఆదేశాలు అమలులో ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. అధికారి నుంచి ప్రత్యేక మినహాయింపు పొందకపోతే ఆ నిర్బంధాలను పాటించాలి.

అడ్డంకులు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఊరేగింపు సజావుగా నిర్వహించుకునేందుకు పోలీసుల సలహాను పాటించాలి. అభ్యర్థులు లేదా పార్టీలు ఒకే మార్గంలో ఊరేగింపు తలపెట్టినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను సంప్రదించాలి.

ఊరేగింపులో పాల్గొనే వ్యక్తులు ఏ వస్తువులూ వెంట తెచ్చుకోకుండా రాజకీయ పక్షాలు, అభ్యర్థులు చూడాలి.

ఇతర రాజకీయ పక్షాల సభ్యులు లేదా నాయకుల దిష్టిబొమ్మలను మోసుకెళ్లడం, దిష్టిబొమ్మలను తగలబెట్టడం, వ్యతిరేక ప్రదర్శన రూపాలను నిర్వహించకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement