● ఆంధ్ర వాటా నీటిని మళ్లిస్తున్నారంటూ రైతుల ఆగ్రహం
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఆంధ్రాకు కేటాయించిన వాటాకు సంబంధించి ఎగువ కాలువ (హెచ్చెల్సీ) నీటి ప్రవాహం తగ్గిపోతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జలాశయం నుంచి హెచ్చెల్సీకి 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెబుతున్నా.. ఆంధ్ర సరిహద్దులోని బొమ్మనహాళ్ వద్దకు వచ్చేసరికి 1,150 క్యూసెక్కుల నీరే చేరుతోంది. మధ్యలోనే 650 క్యూసెక్కుల నీటి ప్రవాహం తగ్గిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రకు రావాల్సిన వాటా నీటిని కొందరు రైతులు అక్రమంగా మళ్లిస్తున్నారని హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లోనే నీటిని మళ్లిస్తే దిగువన ఉన్న ఆంధ్ర రైతుల పంటలకు నీరెలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న తమకు చివరకు నిరాశే మిగులుతోందని ఆవేదన చెందుతున్నారు. జలాశయం నుంచి విడుదలవుతున్న నీటి పరిమాణం, మార్గమధ్యంలో జరుగుతున్న వినియోగం, బొమ్మనహాళ్ సరిహద్దు వద్దకు చేరుతున్న ప్రవాహంపై సమగ్ర తనిఖీలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానిక ఎన్నికలపై శిక్షణ నేడు
● జెడ్పీ సీఈఓ పి.విజయలక్ష్మి
అనంతపురం న్యూ టౌన్: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 15న(గురువారం) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓ పి.విజయలక్ష్మి తెలిపారు. జెడ్పీలోని ఆమె చాంబర్లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మాస్టర్ శిక్షకులను నియమించినట్లు చెప్పారు. రిటైర్డ్ ఎస్డీసీ గోవిందరాజులు (అనంతపురం), రిటైర్డ్ ఎంపీడీఓ పీడీ శ్రీనివాసులు (కనేకల్) శిక్షకులుగా వ్యవహరిస్తారని సీఈఓ పేర్కొన్నారు. గురువారం జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ మీటింగ్ హాల్లో జరిగే ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి జిల్లాస్థాయి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, మండల స్థాయి ఆర్ఓలు, స్పెషల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు తప్పక హాజరు కావాలని సీఈఓ తెలియజేశారు.
నాణ్యత ప్రమాణాలు
పాటించాలి
అనంతపురం అర్బన్: ప్రతి అంశం, పని, వస్తు తయారీలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని కలెక్టర్ ఒ.ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నాణ్యత ప్రమాణాల దినోత్సవ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. భవిష్యత్ తరాల కోసం ప్రపంచం యావత్తు నాణ్యత ప్రమాణాలను పాటిస్తోందన్నారు. అందులో భాగంగా మన దేశం అక్టోబరు 14న అంతర్జాతీయ ‘మానక్ మహోత్సవ్’ నిర్వహిస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐఈఎస్ (ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్), ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్), ఐటీయూ (ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్) వంటి సంస్థలు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రతి ఏటా ఒక నినాదం ప్రకటిస్తున్నారని, ఈ ఏడాది ‘షేర్డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్’(మెరుగైన ప్రపంచం కోసం–భవిష్యత్ తరాల మనుగడ కోసం) స్వచ్ఛమైన నాణ్యమైన ప్రమాణాల వృద్ధి కోసం అనే నినాదాని ఎంచుకున్నట్టు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారులు సేవా సంఘం అధ్యక్షుడు భూపాలం సతీష్‌బాబు, ఉపాధ్యక్షుడు అంకె రామలింగమయ్య, ప్రధాన కార్యదర్శి భుజంగరావు పాల్గొన్నారు.
పట్టు బిగించిన జార్ఖండ్
అనంతపురం: ఏసీఏ ఆధ్వర్యంలో అనంతపురం క్రీడా గ్రామంలో కల్నల్ సీకే నాయుడు యూ–23 టోర్నీలో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు పట్టుబిగించింది. ఒక వికెట్ నష్టానికి 231 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బుధవారం మూడో రోజు తన తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన జార్ఖండ్ జట్టు 133.3 ఓవర్ల వద్ద 351 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో ఎం.దీపక్, టి.వి.సాయి శ్రావణ్ చెరో 3 వికెట్లు, జి.సుమిత్, బత్తిన యశ్వంత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 93 పరుగులకు 3 వికెట్ల నష్టపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 242 పరుగులు చేయగా, మరో 16 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో గరిమెళ్ల తేజ (10 నాటౌట్), జి.సుమిత్ (0 నాటౌట్) ఉన్నారు.


