అనంతపురం: జాతీయ స్థాయి లాన్టెన్నిస్ పోటీలకు ఎస్కేయూ పరిధిలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయానికి (సెంట్రల్ స్కూల్) చెందిన సంహిత ఎంపికై నట్టు పాఠశాల అధికారులు తెలపారు. తాడిమర్రికి చెందిన విద్యార్థిని సెంట్రల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 10 నుంచి రెండు రోజులపాటు శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు చెప్పారు. ప్రతిభ చాటిన విద్యార్థిని సంహితను ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్, కేవీఎస్ ప్రిన్సిపాల్ తయ్యాల శ్రీకర్, ఎస్జీఎఫ్ కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, రాష్ట్ర టెన్నిస్ సంఘం సహాయ కార్యదర్శి నాగరాజ్ బాబు (బాబ్జీ) బుధవారం అభినందించారు. కాగా సంహిత ఈ నెల 23 నుంచి రెండు రోజులపాటు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టు వారు తెలియజేశారు.
రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు దసరా బోనస్ మంజూరు చేసినట్టు బుధవారం రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీలింగ్ పరిమితి రూ.7వేల వేతన ప్రాతిపదికగా 78 రోజుల కాలానికి లెక్కించి ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్గా అందజేయనున్నారు. డివిజన్ వ్యాప్తంగా 14,300 మందికి పైగా ఉద్యోగులకు దసరా బోనస్ అందుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా వేతన సీలింగ్ పరిమితి (రూ.7000) 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి మార్పు లేకుండా కొనసాగుతుండటంపై రైల్వే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


