ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేయడం.. లేఅవుట్ వేసి ప్లాట్లుగా విభజించడం.. ఆపై అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకోవడం ఇటీవల పరిపాటిగా మారుతోంది. తాజాగా అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధిలోని వంక పొరంబోకు భూమిని ‘పచ్చ’ నేతలు కబ్జా చేయడం దుమారం రేపుతోంది. కబ్జా చేసిన ఈ భూమి విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని అంచనా. ఆక్రమణల తొలగింపులో రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
● వంక పొరంబోకులో పాగా..
● లేఅవుట్ వేసి దర్జాగా ప్లాట్ల విక్రయాలు
● అక్రమమని తేలినా కదలని రెవెన్యూ యంత్రాంగం
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 4, ఎల్‌పీ నంబరు 13లో మొత్తం 14.70 ఎకరాల భూమి వంక పొరంబోకుగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. బళ్లారి జాతీయ రహదారి పక్కనే కావడటంతో ఈ భూమికి ఇటీవలి కాలంలో విలువ అమాంతం పెరిగింది. దీంతో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ భూమిపై కన్నేశారు.
ఎకరా విస్తీర్ణంలో 40 ప్లాట్లు
సదరు వంక పొరంబోకు భూమిలో ఎకరా విస్తీర్ణం ఆక్రమించి చదును చేశారు. స్థానికంగా ఉన్న కొందరు చోటా నాయకులను కలుపుకొని టీడీపీకి చెందిన ఓ మండలస్థాయి నాయకుడు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. రెండు సెంట్ల చొప్పున 40 ప్లాట్లుగా విభజించి, హద్దులు ఏర్పాటు చేసి విక్రయాలకు సిద్ధం చేశారు. సెంటు రూ.7లక్షలకు పైబడి బేరం పెట్టారు.
అడ్డుకున్న వీఆర్‌ఓ.. దీర్ఘకాలిక సెలవులోకి..
వంక పొరంబోకు భూమిలో జరుగుతున్న కార్యకలాపాలు స్థానిక వీఆర్‌ఓ దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులు సెలవులో ఉన్న ఆయన తిరిగి విధుల్లో చేరిన అనంతరం, ఇటీవల మళ్లీ ఒత్తిళ్లు ఎదురవడంతో దీర్ఘకాలిక సెలవు పెట్టినట్లు తెలిసింది.
విచారణలో ఆక్రమణ గుర్తింపు
వంక పొరంబోకు భూమిని ఆక్రమించి ప్లాట్లు ఏర్పాటు చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్‌ఓ సదరు స్థలాన్ని పరిశీలించారు. ఒక ఎకరా భూమిని ఆక్రమించి, ప్లాట్లుగా విభజించి హద్దులు ఏర్పాటు చేసినట్లు గుర్తించి నివేదికలో పేర్కొన్నారు. ఆ ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వ భూమిపై చట్టబద్ధమైన హక్కు లేదా అనుమతి ఉన్నట్లు నిర్ధారించే ఆధారాలు పరిశీలనలో కనిపించలేదని స్పష్టం చేశారు. ఆక్రమణలను నిబంధనల ప్రకారం తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని రూరల్ తహసీల్దారుకు నివేదిక సమర్పించారు. అయితే ఇప్పటివరకు వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తహసీల్దారు సైతం ఈ వ్యవహారాన్ని నిర్ధారించారు. అయినప్పటికీ ప్లాట్ల హద్దులు యథాతథంగా ఉండటంతో పాటు విక్రయాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రజాప్రతినిధుల పేర్లతో ఒత్తిళ్లు?
రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ కొందరు రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, వంకలు వంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన స్థలాల పరిరక్షణపై న్యాయస్థానాలు పలు సందర్భాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. వంక పొరంబోకు భూముల ఆక్రమణల విషయంలోనూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమిలో అనధికారికంగా ప్లాట్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించినా.. వాటిని తొలగించడంలో జాప్యం ఎందుకు జరుగుతోందన్నది కీలకంగా మారింది. కాగా ఎలాంటి హక్కులేని వంక పొరంబోకు స్థలంలోని ప్లాట్లను కొనుగోలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసినంత మాత్రాన ప్రభుత్వ భూమిపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు సంక్రమించవని స్పష్టం చేస్తున్నారు.
ఆక్రమించిన భూమిని చదును చేసి ప్లాట్లు వేసిన దృశ్యం


