అనంతపురం క్రైం: మున్సిపల్ పోరుకు సర్వం సన్నద్ధమవుతుండగా...ఇదే అదనుగా టీడీపీ ముఖ్య నాయకుడు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యాడు. కార్పొరేటర్ సీట్లను అంగట్లో సరుకులా అమ్మేందుకు రంగం సిద్ధం చేశాడు. అయితే ఈ వ్యవహారమంతా తన బావమరిదికి అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలోని సీనియర్లంతా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధి బావమరిది అభ్యర్థిత్వాల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ఏమిటని బాహాటంగానే వారు విమర్శిస్తున్నారు.
అభ్యర్థులతో రాయ‘బేరాలు’
అనంతపురం కార్పొరేటర్ అభ్యర్థిత్వాల కేటాయింపు అధికార పార్టీలో డబ్బుల చుట్టూ నడుస్తోంది. ఈక్రమంలోనే మేయర్ బీసీకి రిజర్వ్ అయినందున ఓ మైనార్టీ నేతతో పాటు వాల్మీకి వర్గానికి చెందిన మరో నేతతో టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేత బేరాలు సాగించినట్లు సమాచారం. కాగా కార్పొరేటర్ అభ్యర్థులతో మాత్రం ఒక్కో సీటుకు రూ.15 లక్షల చొప్పున వసూలు చేస్తుంటే...విషయం కాస్తా అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది మందితో బేరాలు కుదరడంతో పాటు డబ్బు చేతులు మారిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రూ.కోటిపైగా నొక్కేశారు!
ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షలు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎనిమిది మందికి సంబంధించిన మొత్తం రూ.1.20 కోట్లు ముఖ్య నాయకుడికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 8 మంది పేర్లు మాత్రమే చర్చలు రాగా, ఇంకా చాలా మందే డబ్బు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో 62 వార్డులుండగా...కనీసం సగం మంది అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. మేయర్ అభ్యర్థి నుంచి అంతకుమించే వసూలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అధిష్టానం దృష్టికి వసూళ్ల వ్యవహారం
ముఖ్యనేత వసూళ్ల వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో డబ్బు వసూళ్ల ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందనే ప్రచారం సాగుతోంది. నిజంగానే నాయకత్వం జోక్యం చేసుకుందా? అభ్యర్థిత్వాల ఎంపికపై ఏమైనా ఆదేశాలు జారీ అయ్యాయా.. అన్న విషయాలు ఇంకా బహిర్గతం కాలేదు. ఈ వివాదం ముదరకుండా తాత్కాలికంగా వ్యవహారాన్ని పార్టీ పెద్దలు పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అంతిమంగా మాత్రం ఎవరు ఓట్లిస్తే వారికే సీట్లు అన్నట్లుగా అధికార పార్టీలో వ్యవహారం సాగుతోంది.
ఒక్కో సీటు రూ.15 లక్షల ధర
బామ్మర్దికి బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యనేత
మైనార్టీ, వాల్మీకీ నేతలతో మేయర్ పీఠానికి బేరాలు!
టీడీపీ అధిష్టానం దృష్టికి వ్యవహారం
ప్రజాప్రతినిధి బావమరిది జోక్యంపై రాజకీయ వర్గాల్లో చర్చ


