● రూ.17 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
అనంతపురం సెంట్రల్: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే మూడు రెట్లు అదనంగా లాభాలు ఇస్తామని నమ్మించి మాజీ సైనికుడిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. బాధితుని ఖాతాలో నుంచి రూ.17 లక్షలు కొట్టేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలో బిందెలకాలనీలో నివాసమంటున్న మాజీ సైనికుడు హరినాథ్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. ఆర్మీలో ఉద్యోగ విరమణ చెందిన తర్వాత వడియంపేట సమీపాన గ్యాస్ గోడౌన్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే మూడు రెట్లు అదనంగా లాభం వస్తుందని నమ్మించారు. అందుకు హరినాథ్ సరే అనడంతో తెలివిగా.. అతని ఖాతా నుంచి నగదును పెట్టుబడి పెట్టగా.. లాభం రూపంలో కొంత మొత్తాన్ని ఇచ్చారు. పూర్తిగా నమ్మిన తర్వాత దాదాపు రూ.17 లక్షల వరకూ మోసం చేశారు. బంగారు నగలను కూడా అమ్మేసి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు బాధితుడు పోలీసులు ఎదుట వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని వన్‌టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.


