తాడిపత్రిటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అల్లర్లు, గొడవలకు దిగితే ఎంతటివారిౖపైనెనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతంగా పేరొందిన తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు పరిశీలించేందుకు ఆయన మంగళవారం తాడిపత్రిలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా అంచనా వేస్తూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి ఎన్నికల సామగ్రి భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నామినేషన్ స్వీకరించే మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అటు నుంచి నందలపాడు, శ్రీనివాసపురం, ఓం శాంతినగర్‌లలో పర్యటించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని ప్రజలను కోరారు. ఎన్నికల సందర్భంగా గొడవలు, అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిపై రౌడీషీటర్ల కదలికపై నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు ఆరోహణరావు, నారాయణరెడ్డి, క్రాంతికుమార్, శ్రీనివాసులు, నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
బ్రహ్మసముద్రం : గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 10న జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో అండర్– 17 విభాగంలో బ్రహ్మసముద్రం జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థి జి.మోహన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, పీడీ హుసేన్, పీఈటీ ఇబ్రహీం తెలిపారు. మోహన్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
15లోపు ఈ–కేవైసీ
పూర్తి కావాలి
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో పంటలు సాగు చేసినట్లు ఈ–క్రాప్ చేయించుకున్న రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లేదంటే కరువు మండలాల కింద వచ్చే ఇన్‌పుట్‌సబ్సిడీ (పెట్టుబడి రాయితీ), ఇన్సూరెన్స్, ఎంఎస్‌పీ కింద పంట ఉత్పత్తుల అమ్మకాలు లాంటి ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే ఈ–క్రాప్ పూర్తయిందని, ఈ–కేవైసీ ఇంకా చాలావరకు రైతులు చేయించుకోలేదన్నారు. మండల వ్యవసాయాధికారులు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు సహకరించి ఫోన్ ద్వారా వచ్చే ఓటీపీల ద్వారా పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతులే స్వయంగా తమ సెల్‌ఫోన్‌ల ద్వారా చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారన్నారు.
గడువులోపు చేయించుకోండి
రాప్తాడు రూరల్: ఖరీఫ్ –2026లో పంట నమోదు చేయించుకున్న రైతులందరూ ఈ నెల 15వ తేదీలోగా రైతు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని రాప్తాడు మండల వ్యవసాయ అధికారి కృష్ణ చైతన్య సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని రైతులకు సూచించారు.


