● మొక్కజొన్న కోత యంత్రం ఢీ: వ్యక్తి మృతి
యల్లనూరు: తాడిపత్రిలోని కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న వ్యక్తి మొక్కజొన్న కోత యంత్రం ఢీకొని మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చింతకాయమంద గ్రామానికి చెందిన జొల్లు పుల్లయ్య చిన్నకుమారుడు నాగార్జున(35) తాడిపత్రి కోర్టులో వాయిదా ఉండటంతో హాజరయ్యేందుకు స్వగ్రామం నుంచి బైక్‌పై బయల్దేరారు. ఈక్రమంలో పుట్లూరు మండలం కొండుగారికుంట గ్రామ సమీపంలో మొక్కజొన్న కోత యంత్రం బైక్‌ను కొట్టింది. ఘటనలో వెనుక టైర్ల కింద పడిన నాగార్జున తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సరిహద్దులో సైన్యం విధులపై అవగాహన
కూడేరు: బ్రాహ్మణపల్లి సమీపాన ఉన్న ఎన్‌సీసీ నగర్‌లో సీఏటీసీ–14వ ఎన్‌సీసీ శిక్షణా శిబిరం నిర్వహించారు. శిక్షణలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి జిల్లాలకు చెందిన 470 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. మంగళవారం క్యాంప్ కమాండర్ అమిత్ గంగ్వార్, అధికారులు క్యాడెట్లకు దేశ సరిహద్దులో సైనిక విధులు, యుద్ధ వ్యూహాలపై అవగాహన కల్పించారు. సరిహద్దులో సైనికులు శత్రువుల నుంచి దేశాన్ని ఏవిధంగా రక్షిస్తారు,. క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారు అనే అంశాలను వివరించారు. ఎత్తయిన పర్వత ప్రాంతాలను అధిరోహించడం, ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు సాగడం, శత్రువుల కదిలికలను గుర్తించడం లాంటి వాటిని వివరించారు. అనంతరం అబ్‌స్టాకిల్‌పై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో క్యాంప్ డిప్యూటీ కమాండర్ మేజర్ అరుణ్, ఎన్‌సీసీ అధికారి శ్రీనివాస్ , రవికుమార్ పాల్గొన్నారు.
ద్విచక్రవాహనాల
దొంగల అరెస్ట్
● 18 వాహనాల స్వాధీనం
అనంతపురం సెంట్రల్: ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్న ఇద్దరిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ కరుణాకర్‌రావు వివరాలను వెల్లడించారు. నగరంలో ద్విచక్రవాహన దొంగతనాలపై ఫిర్యాదు రావడంతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా బెస్త రామాంజనేయులు, బెస్త అంజనకుమార్ అనే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ద్విచక్రవాహనాలను దొంగలించినట్లు అంగీకరించారన్నారు. దొంగలించిన ద్విచక్రవాహనాలను కర్ణాటకలో విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిందితులు ప్రయత్నించారన్నారు. వారి నుంచి 18 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని, అందులో 11 వాహనాలు అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోనే దొంగతనానికి గురయ్యాయని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన వన్‌టౌన్ సీఐ కరుణాకర్, ఎస్‌ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
సెంచరీలతో
కదం తొక్కిన ‘జార్ఖండ్’
అనంతపురం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న కల్నల్ సీకే నాయుడు అండర్–23 క్రికెట్ టోర్నీలో భాగంగా రెండో రోజు మంగళశారం స్టేడియంలో సెంచరీల వర్షం కురిసింది. జార్ఖండ్ బ్యాటర్లు చెలరేగడంతో ఆంధ్ర బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో వికెట్ నష్టానికి 231 పరుగులు చేసింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే జార్ఖండ్ కేవలం 11 పరుగుల వెనుకంజలో ఉండగా, చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి.
శతకాలతో చెలరేగిన బ్యాటర్లు
జార్ఖండ్ బ్యాటర్లు అద్భుతమైన సంయమనం, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆంధ్ర బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా క్రీజులో కుదురుగా ఆడుతూ పరుగుల వర్షం కురిపించారు. విజేష్ దత్తూ 262 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి తగిన సహకారం అందించిన నకుల్ యాదవ్ కూడా 249 బంతుల్లో 108 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరు యువ బ్యాటర్ల అజేయ శతకాల జోరుతో జార్ఖండ్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. కాగా, మూడో రోజు బుధవారం ఉదయం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని పూర్తి చేసి, మ్యాచ్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకోవాలని జార్ఖండ్ భావిస్తోంది.
మృతుడు నాగార్జున


