● 523 హెక్టార్లతో అట్టడుగున బొమ్మనహాళ్ మండలం
● గత ఐదేళ్లలో 6,582 హెక్టార్లకు డ్రిప్ మంజూరు
అనంతపురం అగ్రికల్చర్: గత ఐదేళ్లకు సంబంధించి డ్రిప్, స్రింక్లర్లు (బిందు, తుంపర) సేద్యం పరికరాల పంపిణీ, వాడకంలో కళ్యాణదుర్గం రైతులు ముందంజలో ఉన్నారు. ఇటీవల కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉద్యాన తోటలు, మరీ ముఖ్యంగా టమాట, ఇతర కూరగాయల పెంపకం అధికం కావడంతో వీటికి భారీ డిమాండ్ నెలకొంది. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ పరికరాలతో పాటు సొంతంగా రైతులు వాటిని సమకూర్చుకుని వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అధికారిక సమచారం ప్రకారం గత ఐదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా 82,973 హెక్టార్లకు ఏపీఎంఐపీ ద్వారా రైతులకు డ్రిప్ పరికరాలు పంపిణీ చేశారు. అందులో కళ్యాణదుర్గం మండలంలో రైతులకు 6,582 హెక్టార్లకు మంజూరు చేశారు. కేవలం 523 హెక్టార్లతో బొమ్మనహాళ్ మండలం రైతులు అట్టడుగు స్థానంలో నిలిచారు. బొమ్మనహాళ్ ప్రాంతంలో వరి సాగు అధికంగా ఉండటం, ఉద్యాన పంటల సాగు తక్కువగా ఉన్నందున వీటికి పెద్దగా డిమాండ్ లేదని చెబుతున్నారు.
సూక్ష్మసాగుకు పెరుగుతున్న డిమాండ్..
సూక్ష్మసాగు పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల కాలంలో వేరుశనగ, మొక్కజొన్న, కంది లాంటి వ్యవసాయ పంటలతో పాటు అన్ని రకాల పండ్లతోటలు, పూలు, ఔషధ, కూరగాయ, ఆకుకూరల పంటలకు కూడా డ్రిప్ వాడుతున్నందున రోజురోజుకు విస్తరిస్తోంది. జిల్లాలో 90 శాతం మంది రైతులు డ్రిప్ వాడుతుండగా మరో 10 శాతం మంది స్ప్రింక్లర్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో 50 వేల హెక్టార్లకు అవసరమైన డ్రిప్ కోసం 38 వేల మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. గత ఐదేళ్ల కాలంలో మంజూరు చేసిన గణాంకాలను పరిశీలిస్తే కళ్యాణదుర్గం మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 4,473 హెక్టార్లతో కూడేరు, 4,232 హెక్టార్లతో పుట్లూరు, 4,194 హెక్టార్లతో బుక్కరాయసముద్రం, 3,829 హెక్టార్లతో నార్పల మండలాలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానాల విషయానికి వస్తే బొమ్మనహాళ్ అట్టడుగు స్థానంలో ఉండగా ఆ తర్వాత 859 హెక్టార్లతో విడపనకల్లు, 1,323 హెక్టార్లతో తాడిపత్రి, 1,335 హెక్లార్లతో గుత్తి, 1,777 హెక్టార్లతో పెద్దవడుగూరు చివరి ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మిగతా మండలాల్లో 1,800 హెక్టార్ల నుంచి 3,700 హెక్టార్ల మధ్యలో పంపిణీ చేశారు. మార్చితో ముగిసిన 2025–26లో 23,340 హెక్టార్లకు ఇవ్వడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లు ఏపీఎంఐపీ అధికారులు తెలిపారు. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో 20 వేల హెక్టార్లకు అనుమతులు జారీ కావచ్చని తెలిపారు.


