
కూలిన కల్వర్టు రక్షణ గోడ – ఇద్దరికి గాయాలు
● నాసిరకం పనులే కారణమన్న స్థానికులు
కళ్యాణదుర్గం: స్థానిక టీ సర్కిల్ మీదుగా 20 అడుగులకు పైగా వెడల్పుతో వెళుతున్న కల్వర్టుకు ఇటీవల నిర్మించిన రక్షణ గోడ ఆదివారం సాయంత్రం ఉన్నఫళంగా కుప్పకూలింది. అవతలి వైపుగా ఉన్న దుకాణాలకు, కల్వర్టుకు మధ్యలో రక్షణ గోడను కట్టారు. గోడ పక్కనే తోపుడు బండ్లను పెట్టుకుని వ్యాపారాలతో కొందరు జీవనం సాగిస్తున్నారు. గోడ కుప్పకూలుతుండగా గమనించిన స్థానికులు సాహసం చేసి కూరగాయల వ్యాపారి గోవిందమ్మ, అరటి పండ్ల వ్యాపారి కావేలమ్మను పక్కకు లాగారు. అప్పటికే గోడ కూలడంతో ఇద్దరూ గాయపడ్గారు. కూరగాయల బండితో పాటు ఓ ద్విచక్ర వాహనం శిథిలాల కింద చిక్కుకుని నుజ్జునుజ్జయ్యాయి. అరటి పండ్లు నేలపాలయ్యాయి. స్థానికులు అప్రమత్తం కాకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉండేదని పలువురు వాపోయారు. క్షతగాత్రులను వెంటనే ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
నాసిరకం పనులే కారణం..
కల్వర్టు పనులు చేపట్టిన టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ నాసిరకం పనులు సాగించారని, దీంతో గోడ కుప్పకూలిందంటూ పలువురు స్థానికులు ఆరోపించారు. ఆదివారం ఉదయం కూడా కల్వర్టు కింద పనులు చేశారని తెలిపారు. నీరు ఎక్కువగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అండ చూసుకుని కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారన్నారు. ప్రాణాలు పోయిఉంటే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి ఎమ్మెల్యేనే పూర్తి బాధ్యత వహించి, బాధితులను ఆదుకోవాలని కోరారు. కాగా, విషయం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్, టీడీపీ నేతలు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని జేసీబీ సాయంతో శిథిలాలను తొలగించారు.

కూలిన కల్వర్టు రక్షణ గోడ – ఇద్దరికి గాయాలు