
అలా చేస్తే బాబుకు పుట్టగతులుండవ్
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబుకు పుట్టగతులుండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన బీకేఎస్ మండల పరిధిలోని దయ్యాలకుంటపల్లి, వెంకటాపురం గ్రామాల్లో రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ ఎం మోహన్‌రెడ్డి హాజరయ్యరు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తారంటూ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకువచ్చారన్నారు. ఏనాడూ మెడికల్ కళాశాలల గురించి మాట్లాడని చంద్రబాబు నేడు జగనన్న తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. పరిశీలకుడు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ముసలన్న, ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, సర్పంచ్‌లు పార్వతి, రమేష్, పూల నారాయణస్వామి, కాటమయ్య, చికెన్ నారాయణస్వామి, వరికూటి కాటమయ్య, శివారెడ్డి, కుళ్లాయప్ప, పట్నం ఫనీంద్ర, బాలక్రిష్ణారెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని
ఉపసంహరించుకోవాల్సిందే
మాజీ మంత్రి శైలజానాథ్