
రబీ అంచనా 1,07,503 హెక్టార్లు
అనంతపురం అగ్రికల్చర్: రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. అందులో ప్రధానపంట కింద పప్పుశనగ 65,017 హెక్టార్లు కాగా ఆ తర్వాత నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7,888, వరి 6,069, జొన్న 4,919, ఉలవ 1,377, పొద్దుతిరుగుడు 1,230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చని చెబుతున్నారు. అక్కడక్కడా గోధుమ, సజ్జ, రాగి, కొర్ర, పెసర, మినుము, అలసంద, నువ్వులు, కుసుమ, ఆముదం తదితర పంటలు కూడా సాగులోకి వస్తాయని అంచనా వేశారు.గతేడాది రబీ సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 వేల హెక్టార్లు తగ్గవచ్చంటున్నారు.
80,950 మెట్రిక్ టన్నుల ఎరువులు..
ఈ రబీలో 80,950 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరమని ప్రణాళిక రూపొందించారు. అందులో యూరియా 25,990 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్‌లు 37,900 మెట్రిక్ టన్నులు, డీఏపీ 9,500 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) 4,900 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్‌పాస్ఫేట్ (ఎస్‌ఎస్‌పీ) 2,660 మెట్రిక్ టన్నుల ఎరువులు వివిధ కంపెనీల ద్వారా సరఫరా చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రబీ కింద 4 వేల మెట్రిక్ టన్నుల వరకు వచ్చాయన్నారు.
విత్తనం కోసం ఎదురుచూపు..
రబీ మొదలై 12 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ రాయితీ కింద విత్తన పప్పుశనగ ఎప్పుడిస్తారో అర్థం కాక రైతులు విలవిల్లాడుతున్నారు. ధరలు, రాయితీలు, కేటాయింపులు ప్రకటించి నెల రోజులవుతున్నా విత్తన సేకరణే ప్రారంభించకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. అసలే కేటాయింపులు 28 వేల నుంచి 14 వేల క్వింటాళ్లకు, రాయితీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి పరిమితం చేసి ఇబ్బందులోకి నెట్టిన కూటమి సర్కారు... కేటాయింపుల మేరకై నా ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడం గమనార్హం. నాలుగు రోజులుగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలకే పప్పుశనగ సాగును రైతులు ప్రారంభించారు. చంద్రబాబు సర్కారుపై ఆశలు సన్నగిల్లిన కొందరు విధిలేని పరిస్థితుల్లో బళ్లారి, కర్నూలు జిల్లాల నుంచి విత్తనం తీసుకువస్తున్నట్లు తెలిసింది.