
పురుగు మందు పీల్చి ఉక్కిరిబిక్కిరి
గుంతకల్లుటౌన్: మొక్కజొన్న పంటలో మొవ్వ తొలుచు పురుగులను నియంత్రించడానికి ఆకుసుడుల్లో క్రిమిసంహారక మందులను వేస్తున్న తొమ్మిది మంది మహిళా వ్యవసాయ కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పురుగు మందు వాసన పీల్చడంతో దాని గాఢతకు విపరీతమైన చెమటలు పట్టి, వాంతులతో చేనులోనే కళ్లు తిరిగిపడిపోయారు. ఈ ఘటన ఆదివారం గుంతకల్లు మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ గుంతకల్లు సమీపంలోని ఐదు మోరీల వద్ద బాపట్ల జిల్లా ద్రోణాదులకు చెందిన కౌలురైతు సుబ్బరాయుడు 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం రైతు పిలవడంతో మొక్కజొన్నలో పట్టిన పురుగు నివారణకు మందు చల్లడానికి ఒక్కొక్కరికీ రూ.280 చొప్పున కూలి మాట్లాడుకుని స్థానిక మహబూబ్‌నగర్ కాలనీకి చెందిన 19 మంది వ్యవసాయ కూలీలు ఒకే ఆటోలో కలిసి వెళ్లారు. కార్బొఫ్యూరాన్ 3 శాతం సీజీ అనే పురుగుమందు గుళికలను ఇసుకలో కలిపి ఆకుసుడుల్లో వేస్తుండగా.. మందు వాసన పీల్చడంతో వహీదాబేగం,మహాలక్ష్మి, వరలక్ష్మి, సుశీల, చంద్రకళ, శారదమ్మ, అశ్విని, రామాంజినమ్మ, నాగేశ్వరమ్మలకు విపరీతమైన చెమటలు పట్టి, వాంతులయ్యాయి. కళ్లు తిరిగి అక్కడే పడిపోయారు. కౌలురైతు, తోటికూలీలు వెంటనే వారిని ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణ సేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పురుగు మందు గాఢత నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్లనే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్ధన్‌రెడ్డి తెలిపారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని, తరువాత పరీక్షలు నిర్వహించి వారిని డిశ్చార్జ్ చేస్తామని ఆయన తెలిపారు. కాగా.. మిగిలిన పది మంది కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో వారు ఇళ్లకు వెళ్లిపోయారు.
కనీస జాగ్రత్తలు పాటించకపోవడమే కారణం
మొక్కజొన్నలో కత్తెర పురుగులను నియంత్రించడానికి వినియోగించే కార్బొఫ్యూరాన్ 3 శాతం సీజీ పురుగు మందు చాలా ప్రమాదకరమైనది. పురుగుమందు గుళికలను ఇసుకలో కలిపేటప్పుడు చేతులకు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించాలి. గాలి ఎదురుగా వచ్చినప్పుడు పురుగు మందు ముఖంపై పడుతుంది. అప్పుడు దానిని పీల్చడం వల్లనే అస్వస్థతకు గురవుతారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు కూడా మందు పిచికారీ చేయొద్దు, చల్లొద్దని ఎన్నిసార్లు అవగాహన కల్పించినా చాలా మంది వినడం లేదు. – లీనా వసుంధర,
మండల వ్యవసాయాధికారిణి, గుంతకల్లు
9 మంది మహిళా వ్యవసాయ కూలీలకు అస్వస్థత