
‘చల్ల’గా పాగా వేసేశాడు
అనంతపురం క్రైం: ఆక్రమణలు వద్దు ‘బాబో’ అంటూ ప్రజలు మొత్తుకుంటున్నా ‘చల్ల’గా ఆయన పాగా వేసేశాడు. ప్రజా అవసరాల కోసం వదిలిన స్థలంలో భవనం నిర్మించి వేలాది రూపాయల అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నాడు. కోర్టు రోడ్డులోని సూరి హోటల్ ఎదురుగా 7 అడుగుల వెడల్పు, 67 అడుగుల పొడవు మేర స్థలాన్ని ఓ టీడీపీ నేత ఆక్రమించాడు. ఇందులో హోటల్‌ను నడుపుకునేందుకు అద్దెకిచ్చాడు.తాజాగా ఆ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నాడు. స్థలం కబ్జా చేయడమే కాకుండా పట్టపగలే యథేచ్ఛగా అక్కడ నిర్మాణాలు చేపడుతుండడంపై ఇటీవల పలువురు నగర పాలక సంస్థ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషనరు బాలస్వామి ఆ స్థలాన్ని పరిశీలించి తక్షణం తొలగించుకోవాలని ఆదేశించారు. అధికారుల ఎదుట సరేనని తల ఊపిన కబ్జారాయుళ్లు వారు అటు వెళ్లగానే ఇటు పనులు తిరిగి ప్రారంభించడం గమనార్హం. దీనిపై మళ్లీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినా అటువైపు కన్నెత్తి చూడకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నగరంలో ఎక్కడైనా నాలుగడుగుల స్థలంలో తోపుడు బండి పెట్టుకుంటే వెంటనే అక్కడ వాలి తరిమేస్తున్న అధికారులు.. నగరం నడిబొడ్డున స్కావెంజర్ లైన్‌లో స్థలాన్ని ఓ టీడీపీ నేత ఆక్రమించినా పట్టించుకోకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం... తేల్చేస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ నేత అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తున్నారని, దీంతోనే అధికారులు అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నగరం నడిబొడ్డున
స్కావెంజర్ లైన్ స్థలం కబ్జా
ఓ టీడీపీ నేత బరి తెగింపు