
డీఎస్పీ కార్యాలయం ఎదుట.. దంపతుల ఆత్మహత్యాయత్నం
అనంతపురం సెంట్రల్: ఆర్థిక వ్యవహారాలతో విసుగు చెందిన దంపతులు అనంతపురం డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాధితులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన అశోక్ మూడేళ్ల క్రితం బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన గాలి ఆంజనేయులు కుమార్తె గిరిజను పెళ్లి చేసుకున్నాడు. ఆంజనేయులకు ముగ్గురూ కుమార్తెలు కాగా, తన అవసరాల కోసం అల్లుడు అశోక్ వద్ద దాదాపు రూ. 18 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఏడాది క్రితం చోటు చేసుకున్న ప్రమాదంలో గాయపడి ఆంజనేయులు మృతి చెందాడు. వీరికి దాదాపు 30 ఎకరాల వరకూ స్థిరాస్తి ఉంది. దీంతో అశోక్ తాను రూ.3, రూ.4తో వడ్డీకి తెచ్చి నగదు సమకూర్చానని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అత్త లక్ష్మీదేవిని కోరాడు. అదే సమయంలో తన వాటా కింద రావాల్సిన స్థిరాస్తిని పంచివ్వాలని గిరిజ కోరింది. అయితే అప్పు చెల్లించకపోగా వాటాగా ఇవాల్సిన స్థిరాస్తిని ఇచ్చేందుకూ లక్ష్మీదేవి అంగీకరించలేదు. ఈ విషయంగా పెద్ద మనుషులు పంచాయితీ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చేసిన అప్పు తీర్చే మార్గం కానరాక అశోక్ తన భార్య గిరిజతో కలిసి ఆదివారం ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. అక్కడే ఉన్న డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకుని టూటౌన్ పీఎస్‌కు తరలించారు. తన వదినలైన వందన (బీసీ వెల్పేర్ జూనియర్ అసిస్టెంట్), కవిత (కూడేరు మండలం కదరంపల్లి అంగన్‌వాడీ వర్కర్), కంబదూరు చెందిన రామకృష్ణస్వామి అలియాస్ బంబంస్వామి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని బాధితుడు అశోక్ వాపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపారు.