
ఉపాధి బిల్లుల్లో గోల్‌మాల్!
కళ్యాణదుర్గం: ఉపాధి హామీ పథకం పనులు చేయించిన వారి మెటీరియల్ పేమెంట్ బిల్లుల చెల్లింపులో గోల్‌మాల్ జరిగింది. గత టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లుల విడుదలకు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత దృష్టి సారించింది. ఈ అవకాశాన్ని కంబదూరు మండలంలోని ‘పచ్చ’ నేతలు తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పనులు చేసిన వారికి మొండిచేయి చూపి.. తమ అనుచరులైన వారి ఖాతాలకు వేతనాలు మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఇందుకు ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. 2014 – 2019 మధ్య కాలంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మండలంలో వివిధ శాఖల ద్వారా ఉపాధి హామీ పథకం నిధులతో 497 పనులు చేపట్టారు. 2019 నాటికి మెటీరియల్ పేమెంట్ కింద ఇవ్వాల్సిన బిల్లులు ఆగిపోయాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం పెండింగ్ ఉపాధి బిల్లుల విడుదలకు చర్యలు తీసుకుంది. ఇదే అదునుగా భావించిన టీడీపీ నేతలు వేతన బిల్లులపై కన్నేశారు. కొంతమంది ఉపాధి సిబ్బందితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఆనాడు పనులు చేసిన వారిని కాకుండా.. తాము చెప్పిన వారి ఖాతాలకు మెటీరియల్ పేమెంట్ డబ్బులు పడేలా ప్రణాళిక రచించారు. ఈ క్రమంలోనే మండలంలో శాఖల వారీగా అప్పట్లో చేసిన 497 పనులకు సంబంధించి రూ.22.34 లక్షల బిల్లులను టీడీపీ నేతల అనుచరుల ఖాతాలకు జమ చేశారు.
తూతూ మంత్రంగా విజిలెన్స్ విచారణ..
కంబదూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ నిధుల అక్రమాలపై రెండు రోజుల క్రితం అనంతపురం నుంచి డ్వామా విజిలెన్స్ అధికారి ఒకరు విచారణకు వచ్చారు. అయితే తూతూ మంత్రంగా విచారణ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విచారణ ‘మమ’ అనిపించడం అనుమానాలకు తావిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉపాధి నిధులు జమ అయిన అకౌంట్లను పరిశీలించి ఉంటే పూర్తిస్థాయిలో అక్రమాలు వెలుగులోకి వచ్చేవని పలువురు తెలిపారు.
పనులు చేసిన వారికి మొండిచేయి
పచ్చ నేతల అనుచరుల ఖాతాలకు
నిధులు జమ
2014– 19 నాటి
బిల్లుల మంజూరులో అక్రమాలు

ఉపాధి బిల్లుల్లో గోల్‌మాల్!