
పేదలకు వైద్య విద్య దూరం
కళ్యాణదుర్గం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో నష్టపోయేది మన పిల్లలేనని, పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో తలారి రంగయ్య మాట్లాడుతూ.. పేదలకు వైద్య విద్యను సులభతరం చేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 వైద్య కళాశాలలకు అనుమతి తీసుకువచ్చారన్నారు. వీటిలో 5 కళాశాలలను ప్రారంభించి, అడ్మిషన్లు చేపట్టి తరగతులూ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారన్నారు. మిగిలిన 12 కళాశాలల నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చి ఉంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఓ మెడికల్ కాలేజ్ ఏర్పాటై ఉండేదన్నారు. అయితే వీటి నిర్మాణాలు వద్దని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాసి అడ్డుకోవడమే కాక, తాజాగా వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందే పరిస్థితి లేకుండా పోతోందన్నారు. కళాశాలలు ప్రైవేట్ పరమైతే వైద్య విద్య అత్యంత ఖరీదుతో కూడుకుంటుందని, ఫలితంగా వేరే చిన్న దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లిన మన పిల్లలు అనారోగ్యం బారిన పడటం, ఆక్సిడెంట్ల బారిన పడడం కారణంగా చాలా మంది చనిపోయారని గుర్తుచేశారు. ప్రభుత్వంతో డబ్బులు లేవంటూ సాకులు చెప్పడం సరికాదన్నారు. కూటమి కుట్రలను తిప్పికొట్టి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు కోటి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు రాస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేరు, ఊరు, సెల్ నంబర్‌తో పాటు సంతకాలు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజ్‌కుమార్, మున్సిపల్ విభాగం వైఎస్సార్‌సీపీ కన్వీనర్ సుధీర్, రూరల్ మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, జి.హనుమంతరాయుడు, కౌన్సిలర్లు తిరుమల వెంకటేశులు, గోపారం శ్రీనివాసులు, పరమేశ్వరప్ప, శెట్టూరు జెడ్పీటీసీ మంజునాథ్, దొడగట్ట నారాయణ, కిష్టప్ప, నియోజకవర్గ వివిధ విభాగాల అధ్యక్షులు నాగలక్ష్మి, తిప్పేస్వామి, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు యర్రంపల్లి కృష్ణమూర్తి, రామాంజనేయులు, నాయకులు మురళి, రామిరెడ్డి, రాజు, మల్లికార్జున, పాతలింగ, చరణ్, షెక్షావలి, బిక్కిహరి, రాజు, చిరు,ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ రాజగోపాల్, దొడగట్ట నాయకులు గోవిందప్ప, బసవరాజు, సూరి, తమ్మన్న, బుశప్ప, చిత్తయ్య, ఎర్రిస్వామి, సవారప్ప, రాజు, రవి, పాలన్న, గంగన్నతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే
నష్టపోయేది
మన పిల్లలే
మాజీ ఎంపీ
తలారి రంగయ్య