ప్రాణాలు బలిగొన్న ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

Oct 13 2025 7:24 AM | Updated on Oct 13 2025 7:24 AM

ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

బొమ్మనహాళ్‌: ఈత సరదా ఓ బాలుడిని బలిగొంది. బొమ్మనహాళ్‌ ఎస్‌హెచ్‌ఓ కమల్‌బాషా తెలిపిన మేరకు.. బొల్లనగుడ్డం గ్రామానికి చెందిన రుద్రన్న, బసమ్మ దంపతుల కుమారుడు శివకుమార్‌ (16).. గోవిందవాడ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్నాడు. రెండవ శనివారం సెలవు కావడంతో తన స్నేహితులు ఆరుగురితో కలసి గ్రామ సమీపంలోని హగరి నదిలో ఉన్న కుంటలో ఈత కోసం వెళ్లాడు. అయితే శివకుమార్‌కు ఈత రాదు.. రెండు సార్లు మునిగిపోతుంగా స్నేహితులు వెలికి తీశారు. అయినా వినకుండా మూడో సారి కూడా నీటిలో దిగి గల్లంతయ్యాడు. సాయంత్రం వరకూ స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. విషయం పెద్దలకు తెలిస్తే తమను దండిస్తారనే భయంతో ఇంటికి చేరుకుని మిన్నకుండిపోయారు. రాత్రి అయిన శివకుమార్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు తొలుత స్నేహితులను గట్టిగా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంటనే గజ ఈతగాళ్లను రంగంలో దించి శివకుమార్‌ మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆదివారం ఉదయం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

చందనలో చోరీ

యాడికి: రెండు రోజుల క్రితం యాడికిలోని ఐదు ఇళ్లలో ఒకే రోజు చోటు చేసుకున్న చోరీలను మరువక ముందే మండలంలోని చందన గ్రామంలో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. చందన గ్రామంలో నివాసముంటున్న ఆనంద్‌.. తాడిపత్రి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం ఆనంద్‌ భార్య సరోజ, కుమారుడు, కుమార్తెతో కలిసి కర్ణాటకలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆనంద్‌ తమ్ముడు రమణయ్య కుటుంబ సభ్యులూ ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం నంద్యాలకు వెళ్లారు. దీంతో ఇంటి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం... ఆనంద్‌ ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దుండగులు శనివారం రాత్రి ప్రహరీ దూకి తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. విధులు ముగించుకుని శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న ఆనంద్‌.. చోరీ విషయాన్ని గుర్తించి భార్యకు తెలపడంతో ఆదివారం ఉదయం ఆమె ఇంటికి చేరుకుంది. ట్రంకు పెట్టెలో ఉన్న 3 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి సామగ్రి, రూ.8 వేల నగదు అపహరించినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా 748 మంది టీచర్లు నేడు విధుల్లోకి

అనంతపురం సిటీ: కొత్తగా ఉపాధ్యాయులుగా ఎంపికైన 748 మంది సోమవారం నుంచి విధులకు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నూతన ఉపాధ్యాయులకు విద్యా శాఖ అధికారులు జారీ చేశారు. కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులందరికీ జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. విధుల్లోకి చేరిన మొదటి రోజు నుంచే ఫేషియల్‌ యాప్‌లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని డీఈఓ సూచించారు.

పాత వారిని రిలీవ్‌ చేయండి..

కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారు సోమవారం విధుల్లో చేరనున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో ప్రస్తుతమున్న వారిని వెంటనే రిలీవ్‌ చేయాలని ఎంఈఓలను డీఈఓ ఆదేశించారు. గతంలో బదిలీ అయి, సబ్‌స్టిట్యూట్‌ లేని కారణంగా డిప్యుటేషన్‌పై పాత స్థానాల్లో కొనసాగుతున్న వారు వెంటనే రిలీవ్‌ అయ్యేలా చూడాలన్నారు.

‘పెళ్లి పెటాకులు’ కేసులో

నిందితుడికి రిమాండ్‌

రాప్తాడురూరల్‌: పెళ్లి పెటాకులు చేసిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం రూరల్‌ మండలం మన్నీల గ్రామానికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది. శనివారం ముహూర్తం, ఆదివారం తలంబ్రాలు పెట్టుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన వివాహితుడు బాలచంద్ర అంతకు ముందురోజు వరుడుకి ఫోన్‌ చేసి వధువుతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని, అందుకు సంబంధించిన ఫొటో కూడా పంపుతానని ఇద్దరు ఉన్న ఓ ఫొటోను మొబైల్‌కు పంపాడు. అలాంటి యువతిని పెళ్లి చేసుకుంటాన్నంటే నీ ఇష్టం అంటూ ఫోన్‌ పెట్టేశాడు. దీంతో ఆందోళనకు గురైన వరుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. బాలచంద్ర ఫోన్‌కాల్‌తోనే పెళ్లి చెడిపోయిందని, తనకు ఆయనకు ఏమాత్రం పరిచయం లేదని, కేవలం కక్ష కట్టి తన పెళ్లి చెడగొట్టాడంటూ బాధితురాలు ఇటుకలపల్లి పీఎస్‌లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రెండు రోజుల గాలింపు అనంతరం ఆదివారం బాలచంద్రను అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

3వ తరగతి విద్యార్థి అదృశ్యం

రాప్తాడురూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం కొడిమి దర్గా కొట్టాలుకు చెందిన 3వ తరగతి విద్యార్థి కనిపించడం లేదు. ఈ మేరకు అనంతపురం రూరల్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే...కొడిమి దర్గా కొట్టాలుకు చెందిన వేణు.. పాత సామాన్లు ఏరుకుంటూ వాటిని గుజరీకి వేయడం ద్వారా జీవనం సాగించేవాడు. ఈయనకు ముగ్గురు కుమారులు కాగా, పెద్దకుమారుడు ఈశ్వర్‌ చదువుకోలేదు. రెండో కుమారుడు నరసింహ 6వ తరగతి, మూడో కుమారుడు రామాంజనేయులు 3వ తరగతి ఉరవకొండలోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ నెల 11న తమ్ముళ్లను ఉరవకొండకు వదిలేందుకు ఈశ్వర్‌ పిలుచుకెళ్తుండగా తాను ఇంటికివెళతానంటూ రామాంజనేయులు ఏడ్వడంతో రాచానపల్లి వద్ద బస్సులో నుంచి దించేసి వెళ్లారు. ఈశ్వర్‌ సాయంత్రం ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం తెలపడంతో కంగారుపడిన వారు రామాంజనేయులు కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం వేణు ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు అనంతపురం రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement