
నంది విగ్రహం అపహరణ
పెద్దవడుగూరు: మండలంలోని పి.వీరన్నపల్లిలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న నంది విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో గ్రామస్తులు అటుగా వెళ్లలేకపోయారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు.. నంది విగ్రహం కనిపించడకపోవడంతో విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. పూజారి ఆదిశేషయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
సైబర్ నేరగాళ్ల వలలో రైతు
బొమ్మనహాళ్: మండలంలోని కొలగానహళ్లి గ్రామానికి చెందిన రైతు కావలి రామానాయుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని నగదు కోల్పోయాడు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన అత్యవసర పరిస్థితుల్లో తన పొలాన్ని అమ్మి రూ.4.50 లక్షలు ఉద్దేహాళ్‌లోని ఏపీజీబీలో ఉన్న తన ఖాతాలో జమ చేసి ఉంచాడు. ఇటీవల రూ.3.50 లక్షలు డ్రా చేశారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో రైతు మొబైల్‌లో కోటక్ మహేంద్ర అనే యాప్‌ను ఓపెన్ చేయగా తన ఏపీజీబీ బ్యాంక్ ఖాతా నుంచి 5 సార్లు రూ.19,999లు చొప్పున మొత్తం రూ. 1 లక్ష నగదు మరో ఖాతాకు బదిలీ అయినట్లుగా మెసేజ్‌లు అందాయి. దీంతో వెంటనే బ్యాంక్ అధికారులను కలసి విషయాన్ని తెలపడంతో వారు ఖాతాను పరిశీలించారు. ఖాతా నుంచి నగదును సైబర్ నేరగాళ్లు అపహరించినట్లుగా నిర్ధారించుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితుడు స్ధానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు 1930 నంబర్‌కి సమాచారం అందించాడు.

నంది విగ్రహం అపహరణ