
పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టదా?
గుంతకల్లుటౌన్: ‘పట్టణంలో ఎక్కడ చూసినా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లలపై దాడి చేస్తున్నాయి. కార్లల్లో తిరిగి వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు షేర్ చేయడం కాదు. వీధుల్లో నడుచుకుంటూ తిరగండి. మీకు ఏ వీధిలో ఎన్ని కుక్కలున్నాయో..అవి ఎంతమందిని కరుస్తున్నాయో తెలుస్తుంది. పిల్లల ప్రాణాలు పోయినా పట్టించుకోరా’ అని మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు, మహిళలు నిలదీశారు. గురువారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈద్గా మసీదు ఏరియాకు చెందిన మహిళలు కుక్కకాటుకు గురైన చిన్నారులతో కలిసి మున్సిపల్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. కమిషనర్, శానిటేషన్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకల రామాంజినేయులు, 29వ వార్డు కౌన్సిలర్ జేసీబీ చాంద్‌బాషా, పార్టీ మహిళా నాయకురాలు జి.శాంతిరాణి మాట్లాడుతూ మున్సిపాల్టీ చరిత్రలో ఇలాంటి అధ్వాన్నమైన కమిషనర్‌ను ఎప్పుడూ చూడలేదన్నారు. వీధి కుక్కల బెడదతో పిల్లలను బయటికి పంపాలంటేనే వణికిపోతున్నామన్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కమిషనర్ చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం అక్కడికి చేరుకున్న కమిషనర్ నయీమ్ అహ్మద్‌తో మహిళలు, నాయకులు వాదనకు దిగారు. వార్డుల్లో సమస్యలు విన్నవించేందుకు ఫోన్ చేస్తే స్పందించరా అంటూ నిలదీశారు. 10 రోజుల్లో పరిష్కారం చూపుతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాలనీవాసులు ప్రసాద్, హసీనా, నేత్రావతి, భాస్కర్ పాల్గొన్నారు.