
యూరియాకు ఈ–క్రాప్ మెలిక సరికాదు
అనంతపురం అర్బన్: యూరియా పంపణీకి ఈ–క్రాప్ నమోదుకు మెలికపెట్టడం సరికాదని కలెక్టర్ ఓ.ఆనంద్‌కు సీపీఐ నాయకులు విన్నవించారు. కలెక్టర్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, జె.రాజారెడ్డి, ఇతర నాయకులు కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జిల్లాలో రైతులకు 25,839 టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకూ 15,241 టన్నుల పంపిణీ జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులే చెబుతున్నారన్నారు. అయితే ఇప్పటి వరకూ 20 శాతం కూడా నమోదు కాని ఈ–క్రాప్ ఆధారంగా యూరియా పంపిణీ చేస్తామని మెలిక పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అవసరమున్న ప్రతి రైతుకూ ఈ–క్రాప్‌తో సంబంధం లేకుండా యూరియా అందజేయాలని కోరారు. అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు అందించాలని విన్నవించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేశవరెడ్డి, శ్రీరాములు, టి.నారాయణస్వామి, కార్యవర్గ సభ్యులు రమణ, రాజేష్‌గౌడ్, నాయకులు కృష్ణుడు, మంజు పాల్గొన్నారు.
లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారిగా డాక్టర్ జయలక్ష్మి
అనంతపురం మెడికల్: జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారిగా డాక్టర్ జయలక్ష్మి నియమితులయ్యారు. రాయదుర్గం కమ్యూనిటీ ఆస్పత్రిలో చర్మ వ్యాధుల వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ జయలక్ష్మిని పదోన్నతిపై వచ్చిన ఆమె శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ భ్రమరాంబదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కింది స్థాయి సిబ్బందికి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
19 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
గార్లదిన్నె: మండలంలోని మర్తాడులో పేకాట ఆడుతూ 19 మంది పట్టుబడినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. అందిన సమాచారం మేరకు ఆ గ్రామంలో శుక్రవారం తనిఖీలు చేపట్టామన్నారు. యల్లమ్మ గుడి సమీపంలో అనంతపురానికి చెందిన 19 మంది పేకాట ఆడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రూ.65,140 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

యూరియాకు ఈ–క్రాప్ మెలిక సరికాదు