
నకిలీ నోట్ల తయారీ కేసులో నిందితుల అరెస్ట్
అనంతపురం: నకిలీ నోట్ల తయారీ, చలామణితో పాటు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎస్పీ జగదీష్ శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో విలేకరులకు వెల్లడించారు. కంబదూరులోని పాత ఎస్సీ కాలనీకి చెందిన ఎం.జశ్వంత్ అలియాస్ జస్వంత్ ఉరఫ్ రాజు అలియాస్ గుండు, ఆర్డీటీ కాలనీ చెక్‌పోస్టు వద్ద నివాసముంటున్న భోగంరాజు అలియాస్ షాలేము రాజు ఉరఫ్ షాలెమ్ మంచి స్నేహితులు. క్రికెట్ బెట్టింగ్, పేకాట, తదితర వ్యసనాలకు బానిసలుగా మారి అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్‌లు, నకిలీ నోట్ల తయారీ, చలామణి తెరలేపారు. అనంతపురం, పుట్లూరు, నార్పల, ఉరవకొండ, తాడిపత్రి చుట్టుపక్కల గ్రామాలు, వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలంలోని పలు గ్రామాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. గత రెండేళ్లలోనే 12 చైన్‌స్నాచింగ్‌లకు సంబంధించి వీరిపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ కలర్ ప్రింటర్‌ను సమకూర్చుకుని నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేయడం మొదలు పెట్టారు. నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి, రూ.35 లక్షల విలువ చేసే 304 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.35,500 నగదు, నకిలీ 500 రూపాయల నోట్లు, ప్రింటర్, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.