
వైద్య విద్య ప్రైవేటీకరణ తగదు
● విద్యార్థుల సమస్యలు పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు
● ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే వైద్య విద్య ప్రైవేటీకరణ అని, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకే పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తోందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు మండిపడ్డారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా విద్యా రంగ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన వలరాజు మాట్లాడుతూ.. ‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విద్యార్థుల కష్టాలు తీరుస్తాం. విద్యార్థులకు ఏ కష్టాలు కూడా ఉండవు. వారికి అండగా నేనుంటా’ అని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఈ రోజు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ విద్యార్థుల సమస్యలను అటకెక్కించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయలేదన్నారు. గత అసెంబ్లీ సాక్షిగా చేసిన రూ. 600 కోట్లు కూడా కేవలం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, నగర అధ్యక్ష, కార్యదర్శులు మంజునాథ్, ఉమామహేష్, నాయకులు భాస్కర్, కార్తీక్, కుమార్, నాని జోసెఫ్, అక్రమ్, ఉదయ్ కిషన్ పాల్గొన్నారు.