
పెద్దాస్పత్రిలో భద్రత ఏదీ?
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం, భద్రతా వైఫల్యం కారణంగా హౌస్ సర్జన్లు, ట్రైనీ నర్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘నిన్ను ప్రేమిస్తున్నా’..నన్ను ప్రేమిస్తావా’ అంటూ వెంటపడి వేధించే జులాయిల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో సర్వజనాస్పత్రిలో విధులకు హాజరు కావాలంటేనే హౌస్‌సర్జన్లు, ట్రైనీ నర్సులు హడలెత్తిపోతున్నారు. ఇటీవల విధుల్లో ఉన్న ఓ హౌస్ సర్జన్‌ను ఓ జులాయి వేధింపులకు గురి చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.
రాష్ట్రంలోనే ఏఎంసీకి ప్రత్యేక గుర్తింపు
వైద్య విద్యను అందించడంలో రాష్ట్రంలోనే అనంతపురం మెడికల్ కళాశాల (ఏఎంసీ)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎందరో విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే యూజీ, పీజీ సీట్లనూ అధికారులు పెంచారు. అయితే నిర్వహణ లోపాలతో అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తోంది. వైద్య విద్య అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థినులకు సరైన భద్రత కల్పించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అసభ్య ప్రవర్తనతో బెంబేలు
ఏఎంసీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థినులు తరచూ జీజీహెచ్ (ప్రభుత్వ సర్వజనాస్పత్రి)కు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే జీజీహెచ్‌లో సరైన భద్రతా వ్యవస్థ లేదు. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో పరిశీలించే పటిష్టమైన సెక్యూరిటీ సిబ్బంది లేరు. సీసీ కెమెరాల నిఘా అంతంత మాత్రమే. ఇదే ట్రైనీ నర్సులు, హౌస్‌సర్జన్ల పాలిట శాపంగా మారింది. తరచూ వారి వెంట పోకిరీలు పడుతున్నారు. ఇటీవల పిచ్చి పరాకాష్టకు చేరుకున్న ఓ జులాయి వారం రోజులుగా ఓ హౌస్ సర్జన్ వెంటపడి వేధింపులకు గురి చేస్తూ చివరకు అందరూ చూస్తుండగానే జీజీహెచ్‌లో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైనట్లు తెలిసింది. ఈ నెల 13న తన పట్ల ఓ అపరిచిత యువకుడు అనుచితంగా ప్రవర్తించాడని జీజీహెచ్ యాజమాన్యం దృష్టికి బాధిత హౌస్ సర్జన్ తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సకాలంలో యాజమాన్యం స్పందించకపోవడంతో జులాయి ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. అప్పటి నుంచి రోజూ హౌస్ సర్జన్ వెంటపడి వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. ఈ నెల 15న మరోసారి ఎఫ్‌ఎం వార్డు వద్ద హౌస్ సర్జన్‌ను అడ్డుకుని తనను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో బెంబేలెత్తిన ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని అక్కడ డ్యూటీలో ఉన్న హెడ్‌నర్సు ద్వారా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత దృష్టికి బాధితురాలు తీసుకెళ్లింది. కాగా, వేధింపులు మొదలైన తొలి రోజే అధికారులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని తెలుస్తోంది.
జులాయి అరెస్ట్
హౌస్ సర్జన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హౌస్ సర్జన్‌ను వేధించిన యువకుడిని అనంతపురం రూరల్ మండలం సిండికేట్ నగర్‌కు చెందిన మోహన్‌సాయిగా గుర్తించి, శుక్రవారం అరెస్ట్ చేశారు. కాగా, వేధింపులతో భయాందోళనకు గురైన హౌస్ సర్జన్ తన స్వగ్రామానికి వెళ్లిపోయినట్లు సమాచారం.