
యువకుడి దుర్మరణం
యాడికి: ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ బాషా (34)కు భార్య రబియా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నైటీల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం సాయంత్రం రాయలచెరువుకు వెళ్లిన సయ్యద్ బాషా అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో క్రిష్టిపాడుకు ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. రాయలచెరువు దాటిన తర్వాత పెట్రోల్ బంక్ సమీపంలో గుత్తి వైపుగా వెళుతున్న లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనుకనే వేగంగా వస్తున్న సయ్యద్ బాషా ఢీకొన్నాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
నక్క దాడిలో 30 గొర్రె పిల్లల మృతి
కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామంలో శుక్రవారం గొర్రె పిల్లల మందపై నక్క దాడి చేసింది. ఘటనలో 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మహేంద్ర తన గొర్రెలను మోపు కోసం తోలుకెళుతూ పిల్లలను వేరు పరిచి ఇంటి సమీపంలోని దొడ్డిలో వదిలి వెళ్లినప్పడు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో దాదాపు రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు.