
బాబు మెడి‘కిల్’పై ఉక్కుపిడికిలి
● నేడు యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజ్’
అనంతపురం కార్పొరేషన్: సీఎం చంద్రబాబు కుట్రపూరిత మెడి‘కిల్’పై వైఎస్సార్ సీపీ ఉక్కుపిడికిలి బిగించింది. పేదింటి బిడ్డలకు వైద్య విద్య భారం కాకూడదని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 17 నూతన వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండలో రూ.470 కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చాలా వరకూ నిర్మాణ పనులు జరిగాయి. ఇక.. నిర్మాణ పనులు పూర్తి చేసి అప్పట్లోనే 5 కళాశాలలను ప్రారంభించారు. ఆ సమయంలోనే ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పేదల ఆశలపై నీళ్లు జల్లుతూ సీఎం చంద్రబాబు ‘పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ)’ని తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 10 కళాశాలలను ప్రైవేటీకరణ చేసే చర్యలకు ఉపక్రమించారు. ప్రైవేట్ చేతుల్లోకి మెడికల్ కళాశాలలు వెళితే పేద విద్యార్థులు ఆ వైద్య కళాశాలల గుమ్మం ఎక్కలేని పరిస్థితి తలెత్తనుండడంతో పాటు వైద్యం ఖరీదవుతుందని, ఇది సమాజానికి మంచిది కాదని భావించిన వైఎస్సార్ సీపీ పోరాటాలకు సిద్ధమైంది. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే శుక్రవారం యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా హాజరుకానున్నారు.
విజయవంతం చేయాలి
సీఎం చంద్రబాబు ఎప్పుడూ తన అనుయాయులకు దోచిపెట్టడం కోసం పోటీ పడుతుంటారు. రాజధాని పేరుతో రూ.లక్షల కోట్ల అప్పు తీసుకురావడంతో పాటు రైతుల భూములను లాక్కున్నారు. రాజధానిని కూడా పీపీపీలో అభివృద్ధి చేస్తారా అనే విషయాన్ని ఆయన చెప్పాలి. పేద పిల్లలు కూడా వైద్య విద్యనభ్య సించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విప్లవాత్మకంగా 17 వైద్య కళాశాలలను తీసుకువచ్చారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలు నడిస్తే నాణ్యమైన వైద్యం, పేదల పిల్లలకు వైద్య విద్య సాధ్యపడుతుందా అనేది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆలోచించాలి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపడుతున్నాం. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.
– అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు