
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
గుత్తి: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు. గుత్తి ఆర్‌ఎస్‌లో ఇటీవల డెంగీతో హర్షిత్ (2), సంయుక్త (7) అనే చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ఈబీ దేవి, జిల్లా మలేరియా అధికారి ఓబులు పర్యటించారు. చిన్నారుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అపరిశుభ్రత, మురుగు కారణంగా దోమలు స్వైర విహారం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుని, తమకు జరిగిన నష్టం ఎవరికీ జరగకుండా చూడాలని మృతుల కుటుంబ సభ్యులు వైద్యాధికారులను కోరారు. అనంతరం వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వర పీడితులకు రక్త పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు అందజేశారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు అమర్నాథ్, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రభాకర్, వైద్యులు రమ్య, షాషా వలి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తండ్రిని చంపిన తనయుడు
పామిడి: తాగిన మైకంలో తల్లిని వేధిస్తుండడాన్ని తట్టుకోలేక కుమారుడు రోకలి బండతో మోది తండ్రిని హత్య చేశాడు. పామిడిలోని బెస్తవీధిలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పామిడి పోలీసులు తెలిపిన మేరకు.. సుధాకర్ (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య మీనాక్షి, కుమారుడు ప్రకాష్‌ను పోషించేవాడు. ఇటీవల సుధాకర్ మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో భార్య మీనాక్షిని వేధించేవాడు. బుధవారం అర్ధరాత్రి కూడా పూటుగా మద్యం తాగి వచ్చి భార్యను వేధించసాగాడు.ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన కుమారుడు ప్రకాష్ తన తల్లి సహకారంతో రోకలిబండతో సుధాకర్ తలపై మోదాడు. దీంతో తలపగిలి సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రకాష్‌తో పాటు మీనాక్షిని అరెస్ట్ చేశారు. సీఐ రాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దూసుకొచ్చిన మృత్యువు
● ప్రైవేటు బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం
రాయదుర్గంటౌన్: ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని ఊరువాకిలి మొలకల్మూరు రోడ్డు క్రాసింగ్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సీఐ జయనాయక్ తెలిపిన మేరకు.. గురువారం తెల్లవారుజామున మొలకల్మూరు రోడ్డు క్రాసింగ్‌లో మారెమ్మ గుడి ఏరియాకు చెందిన నాయకుల ఓబులేశు (60),అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నాగరాజు రోడ్డు దాటుతుండగా ఎస్‌ఆర్‌జే ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఢీ కొంది. ఘటనలో ఓబులేశు కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. నాగరాజు ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతింది. స్థానికులు ఇద్దరినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ నాయకుల ఓబులేశు మృతి చెందాడు. నాగరాజును కుటుంబీకులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఓబులేశు కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయనాయక్ తెలిపారు.
రెండు బార్లకు లాటరీ
అనంతపురం: జిల్లాలో రెండు బార్లకు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. నూతన బార్ పాలసీలో భాగంగా ఇటీవల 9 బార్లకు రీ నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు బార్లకు మాత్రమే దరఖాస్తులు అందాయి. ఈ క్రమంలో గురువారం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కలెక్టర్ ఓ. ఆనంద్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం, గుత్తిలో రెండు బార్లకు లాటరీ నిర్వహించారు. ఎంపికైన వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. రామమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి