
ఆశగా రప్పించి.. నిరాశతో పంపించి
అనంతపురం ఎడ్యుకేషన్: గుంటూరులో శుక్రవారం జరగాల్సిన ‘డీఎస్సీ–25 కొత్త టీచర్లకు నియామక పత్రాల అందజేత’ కార్యక్రమం వాయిదా పడింది. ముందెన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రచార యావ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణ లున్నాయి. ఇందుకోసం జిల్లాలో 45 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక అభ్యర్థికి తోడుగా కుటుంబ సభ్యుడు కచ్చితంగా రావాల్సిందేనని చెప్పారు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులు తమకు వీలుకాదని, అనారోగ్యంగా ఉన్నామని వేడుకున్నా కనికరించలేదు. ప్రతి అభ్యర్థికి తోడుగా తప్పనిసరిగా కుటుంబ సభ్యుల్లో ఒకరు రావాల్సిందేనని, ఉద్యోగం కావాలంటే తప్పదని స్పష్టం చేశారు. గురువారం ఉదయం 6 గంటలకల్లా అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోవాలని సూచించారు. ఇక్కడికి చేరుకోవడానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉన్నవారు సైతం రాత్రికి రాత్రే చేరుకున్నారు. మరికొందరు ఉదయాన్నే వచ్చారు. అక్కడ 45 బస్సులు సిద్ధం చేశారు. ప్రతి బస్సుకు నలుగురు లైజన్ ఆఫీసర్లను నియమించారు. అల్పాహారం సిద్ధం చేయగా.. అందరూ తిని బస్సుల్లో ఎక్కి కూర్చున్నారు. అయితే, వర్షాల కారణంగా కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు డైరెక్టరేట్ నుంచి సమాచారం అందడంతో ఆ మేరకు డీఈఓ ప్రసాద్‌బాబు అధికారికంగా ప్రకటించారు. ముందుచూపు లేకుండా కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారని పలువురు అభ్యర్థులు మండిపడ్డారు. వాతావరణ శాఖ నుంచి కనీస ముందస్తు సమాచారం కూడా తీసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. వచ్చిన వారందరికీ అప్పటికే సిద్ధంగా ఉన్న బస్సుల్లో వారివారి ఊళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు బస్సులు పంపారు. మరోవైపు జిల్లా నుంచి వెళ్లే అభ్యర్థులకు కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో మధ్యాహ్న భోజనాలు సిద్ధం చేశారు. కార్యక్రమం వాయిదా పడడంతో భోజనాలను సమీపంలోని స్కూళ్ల విద్యార్థులకు అందించినట్లు తెలిసింది.
‘కొత్త టీచర్లకు నియామక పత్రాల అందజేత’ వాయిదా
బస్సుల్లో కూర్చున్న తర్వాత ప్రకటించిన వైనం