
యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి
● వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం అర్బన్: ‘‘యూరియా అవసరమైన చోటికి సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయాలి. క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసర మున్న రైతులకే యూరియాను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఐఎఫ్‌ఎంఎస్ ఆన్‌లైన్ పోర్టల్, భౌతిక నిల్వలకు తేడా రాకుండా పర్యవేక్షించాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈనెల 24లోపు ఆన్‌లైన్ నివేదిక అందించాలన్నారు. యూరియా పంపిణీకి సంబంధించి రోజువారీ నివేదిక ఇవ్వాలన్నారు. యూరియా అవసరమున్న చోట అవుట్‌రీచ్ క్యాంపెయిన్ నిర్వహించి ఎక్కువ మంది రైతులు వచ్చేలా చూడాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈకేవైసీ, ఎన్పీసీఐ లింక్ పెండింగ్‌పై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి ఐదు చొప్పున అగ్రీటెక్ స్టార్టప్‌లను గుర్తించాలని ఆదేశించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించా లన్నారు. ప్రస్తుతం జిల్లాలో మొక్కజొన్న, వేరుశనగ, తదితర పంటలు కోత దశలో ఉన్నాయని, వాటి ప్రస్తుత మార్కెట్ ధరలను క్షేత్రస్థాయి సిబ్బంది గమనిస్తూ సీఎం యాప్‌లో నమోదు చేసేలా చూడాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) కింద పెండింగ్ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. పశుకిసాన్ క్రెడిట్ కార్డులను వందశాతం అందజేయాలని చెప్పారు. ఆయిల్ పామ్ తోటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఎంపీఎఫ్‌సీ గోదాముల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని 58 పీఏసీఎస్‌లకు సంబంధించి సీడ్ లైసెన్స్, ఫర్టిలైజర్స్ లైసెన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఉద్యానశాఖాధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మా నాయక్,మార్కెటింగ్ ఏడీ రాఘవేంద్రకుమార్, డీసీఓ అరుణకుమారి, సెరికల్చర్ ఏడీ విజయ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.