
మతం పేరున ఆర్డీటీని వెళ్లగొట్టే పన్నాగం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: మతం పేరున ఆర్డీటీని వెళ్లగొట్టే పన్నాగం పన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆర్డీటీ పరిరక్షణ బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గురువారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు జిల్లా ప్రజలకు ఆర్డీటీ కల్పతరువులాంటిదన్నారు.బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ఏటా 8.5 లక్షల మందికి వైద్య సేవలందుతున్నాయని చెప్పారు. ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆర్డీటీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ జిల్లాలో పర్యటించి ఆర్డీటీ అతిథి గృహంలోనే బస చేశారని, ఆ సమయంలో ఆర్డీటీకి సాయమందిస్తామని చెప్పి నేడు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఆర్డీటీ సేవలు కొనసాగేలా చొరవ చూపాలని సీఎం చంద్రబాబుకు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే లేఖ రాశామన్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య నాయకత్వంలో ఆర్డీటీ పరిరక్షణ బైక్ ర్యాలీ, పాదయాత్ర చేశామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోపు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కాకుంటే ఆర్డీటీని మూసివేసే దుస్థితి వస్తుందన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డీటీపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు. ఆర్డీటీపై లక్షలాది మంది ఆధారపడ్డారన్న విషయం కూటమి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఒప్పించి ఆర్డీటీని కాపాడాలని, లేకపోతే అందరినీ కలుపుకుని ప్రభుత్వ మెడలు వంచైనా సంస్థను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, ఎద్దుల అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు రాధాకృష్ణ, సాకే కుళ్లాయ స్వామి, కేశవరెడ్డి, జానీ, భారతి తదితరులు పాల్గొన్నారు.