
పోలీసుల భయం..తీసింది ప్రాణం
శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండాకు చెందిన రామకృష్ణ నాయక్ (35) పోలీసులకు భయపడి గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగులగుడ్డం తండాలో పేకాట ఆడుతున్నారని శింగనమల పోలీసులకు సమాచారం రావడంతో ఎస్‌ఐతో పాటు ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం వెళ్లారు. పేకాట శిబిరంపై దాడి చేసి.. కొంత నగదు, సెల్‌ఫోన్లు తీసుకెళ్లారు. పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు సోమవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. అందరూ సోమవారం బైక్‌లపై పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరారు. పోలీసులు కొడతారని రామకృష్ణ నాయక్ తీవ్రంగా భయపడిపోవడంతో మార్గమధ్యంలోనే గుండెపోటు వచ్చింది. వెంటనే శింగనమల కమ్యూనిటీ హెల్త్ సెంటరుకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న నాగులగుడ్డం తండా వాసులు, కుటుంబసభ్యులు కమ్యూనిటీ హెల్త్‌సెంటరుకు తరలివచ్చారు. అక్కడి నుంచి మృతదేహాన్ని స్ట్రెచర్ మీద తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు, మండల టీడీపీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. చివరకు బాధితుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో టీడీపీ నాయకులు, పోలీసులు చర్చించారు. రామకృష్ణ నాయక్ భార్యకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టు ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య ఇంద్ర, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య బాలింత కావడంతో ప్రస్తుతం పుట్టినిల్లు జొన్నగిరిలో ఉంది. కాగా..ఈ ఘటనపై డీఎస్పీతో విచారణ చేయిస్తామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. రామకృష్ణ నాయక్‌ను తాము కొట్టలేదని, కనీసం బెదిరించలేదని శింగనమల సీఐ కౌలుట్లయ్య వివరణ ఇచ్చారు.
పేకాట కేసులో స్టేషన్‌కు రావాలని పోలీసుల వాకబు
తీవ్ర భయాందోళనకు గురైన
నిందితుడు
గ్రామం నుంచి బైక్‌లో
వస్తుండగా గుండెపోటు
శింగనమల సీహెచ్‌సీలో
చికిత్స పొందుతూ మృతి
స్టేషన్ ఎదుట గ్రామస్తుల ధర్నా

పోలీసుల భయం..తీసింది ప్రాణం