యూరియా కొరతపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

యూరియా కొరతపై కన్నెర్ర

Sep 17 2025 9:06 AM | Updated on Sep 17 2025 9:24 AM

అనంతపురం సిటీ: యూరియా కొరతపై సభ్యులు కన్నెర్రజేశారు. రైతుల అవసరాలకు తగ్గట్టు యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. జిల్లాకు వస్తున్న యూరియా ఎక్కడికెళ్లిపోతోందని నిలదీశారు. యూరియాను తన్నుకుపోతున్న గద్దలెవరో నిగ్గు తేల్చాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. అనంతపురంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ భవన్‌లో చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు శివ్‌ నారాయణ్‌ శర్మ, అభిషేక్‌ కుమార్‌, సీఈఓ శివశంకర్‌, డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య హాజరయ్యారు. యూరియా కొరతపై జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయాన్ని జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించారు. గుమ్మఘట్ట, అనంతపురం రూరల్‌, చెన్నేకొత్తపల్లి, పరిగి జెడ్పీటీసీ సభ్యులు మహేశ్‌, చంద్రకుమార్‌, గోవిందరెడ్డి, శ్రీరామప్ప యూరియా కొరత గురించి ప్రస్తావిస్తూ రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కర్ణాటకలో తక్కువ ధరకే యూరియా దొరుకుతోందని, ఏపీలో ఎందుకు కొరత వస్తోందని నిలదీశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను కొందరు దళారులు కుమ్మకై ్క పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై అనంతపురం ఎంపీ స్పందిస్తూ కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడి కావాల్సినంత యూరియా తెప్పిస్తున్నట్లు తెలిపారు. అయితే డిమాండ్‌ రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. దీనికి కారణం.. అవసరానికంటే ఎక్కువ యూరియాను రైతులు తీసుకెళ్లడమేనని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ స్పందిస్తూ.. రైతుల సమస్యలను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకొని డిమాండ్‌కు తగ్గట్టు యూరియా సరఫరా చేసి ఆదుకోవాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ మాట్లాడుతూ రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం యూరియా సరఫరా చేస్తోందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో మొక్కజొన్న ఎక్కువగా సాగవుతోందని, మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని లేపాక్షి జెడ్పీటీసీ సభ్యుడు శీనురెడ్డి సభ దృష్టికి తెచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనం ఇస్తారో ఇవ్వరో తేల్చాలని రొద్దం జెడ్పీటీసీ సభ్యురాలు హరేసముద్రం పద్మ కోరారు. తల్లికి వందనం రాని వారి జాబితా ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులను అడుగుతున్నా ఎందుకు ఇవ్వడం లేదని బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్‌ నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజాప్రతినిధులు కాని వారిచేత జాతీయ పతాకావిష్కరణ చేయిస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ చంద్ర ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ పాటించకపోయినా.. బయటి వ్యక్తులతో జెండా ఆవిష్కరణ చేయించినా చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ హెచ్చరించారు.

ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌పై వాగ్వాదం

ఆర్డీటీకీ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యూవల్‌ అంశంపై సభలో వాగ్వాదం జరిగింది. బడుగు, బలహీన వర్గాలవారి పాలిట జీవనాడిగా ఉన్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయాలని జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, దళితులు, గిరిజనులు, బీసీలు ఆందోళనలు చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్పందిస్తూ కేంద్రంలోని పెద్దలందరినీ కలసి విన్నవిస్తున్నామని, ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని అన్నారు. దీంతో సభ్యులందరూ మూకుమ్మడిగా నిలదీశారు. ఆర్డీటీకి నిధులు వస్తే గానీ పేదల జీవితాల్లో వెలుగులు నిండవని పేర్కొన్నారు. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌ జోక్యం చేసుకుని సద్దుమణిగించారు.

సర్వజనాస్పత్రిలో అక్రమాలపై ఆందోళన

అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో జరుగుతున్న అక్రమాలు, వ్యవహారాలపై గోరంట్ల, అనంతపురం జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాం నాయక్‌, చంద్రకుమార్‌ సభ దృష్టికి తెచ్చారు. ఈసీజీ, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సహా విలువైన రక్త పరీక్షలన్నీ పెద్దాస్పత్రిలోనే చేయించాలని ప్రభుత్వం ఆదేశించినా.. యంత్రాలు చెడిపోయాయంటూ రోగులను సత్యం డయాగ్నస్టిక్‌కు ఎందుకు పంపుతున్నారని నిలదీశారు. ప్రతి నెలా రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఎందుకు చెల్లించాల్సి వస్తోందని, ఈ వ్యవహారంలో ఎవరెవరికి ఎంతెంత వాటా ముడుతోందని ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సిన సూపరింటెండెంట్‌ గైర్హాజరు కావడంపై జెడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీ మండిపడ్డారు. సర్వజనాస్పత్రిలో మహిళా రోగులకు, సహాయకులకు రక్షణ కరువైపోయిందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నిలదీసిన సభ్యులు

యూరియాను తన్నుకుపోతున్నదెవరో నిగ్గు తేల్చాలని డిమాండ్‌

రైతులే అదనంగా తీసుకెళ్తున్నారని ఎంపీ అంబికా వ్యాఖ్యలు

డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేసి ఆదుకోవాలన్న చైర్‌పర్సన్‌ గిరిజమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement