
అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
● నిందితుడు టీడీపీ కార్యకర్త
గుంతకల్లు రూరల్/వెల్దుర్తి: అంతర్ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసి, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు గుంతకల్లు రూరల్ పీఎస్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. స్థానిక కసాపురం పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం బుగ్గ సంగాల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ద్విచక్ర వాహనాల అపహరణ అంశం వెలుగు చూసింది. పట్టుపడిన యువకుడిని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎల్.నగరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త పింజారి షెక్షావలిగా గుర్తించారు. నాలుగు పల్సర్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, గతంలో బుక్ కీపర్‌గా పనిచేసిన షెక్షావలిపై కసాపురం పీఎస్‌లో 2, కర్నూలు త్రీటౌన్ పీఎస్‌లో 1, గుంతకల్లు రెండో పట్టణ పీఎస్‌లో 1 చొప్పున కేసులున్నాయి.
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి (20) అదే కళాశాల హాస్టల్ గదిలో మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.