
యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి విమర్శించారు. యూరియా కొరత, ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలనే డిమాండ్‌తో మంగళవారం అనంతపురంలోని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి, సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడారు. ఆర్‌ఎస్‌కేల్లో తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఉలవ, సజ్జ, రాగి, జొన్న, కొర్ర తదితర ప్రత్యామ్నాయ విత్తనాలు అందివ్వాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకూ నెలకు రూ.10 వేలు ప్రకారం పింఛన్ చెల్లించాలన్నారు. రైతు రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు అందివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం టెక్నికల్ ఏఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.