
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
● కలెక్టరేట్ ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంటకేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్ధీన్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి నరసింహులు మాట్లాడారు. 12వ వేతన సంఘాన్ని నియమించాలన్నారు. 30 శాతం మధ్యంతరభృతిని ప్రకటించాలన్నారు. బకాయిపడిన నాలుగు డీఏలను విడుదల చేయాలన్నారు. బోధనా సమయాన్ని వృథా చేస్తున్న అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని ఉపసంహరించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదన్నారు. ఓపీఎస్ అమలు చేయాలన్నారు. రాష్ట, జిల్లా నాయకులు నరేష్‌కుమార్, సుభద్ర, సర్దార్‌వలి, వెంకటరమణ, కృష్ణ, అంజలీదేవి, ప్రేమావతి, శ్రీదేవి, వన్నప్ప, బాల రామ్మోహన్, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న అభ్యర్థులూ తరలిరండి : డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులందరూ ఈ నెల 19న అమరావతిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. మంగళవారం తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపికై న అభ్యర్థితో పాటు తోడుగా మరొకరు విజయవాడకు రావచ్చన్నారు. ప్రయాణ ఖర్చులు, వసతి, భోజన సదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 18న ఉదయం 6 గంటలకు అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోవాలన్నారు. ప్రతి బస్సుకు నలుగురు చొప్పున లైజన్ ఆఫీసర్లను నియమిస్తామన్నారు. 19న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం చంద్రబాబుతో మీటింగ్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికీ కిట్టుతో పాటు అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందజేస్తారని, అదే రోజు రాత్రి బయలుదేరి మరుసటి రోజు ఉదయం జిల్లాకు చేరుకుంటారన్నారు.
తాగుడుకు డబ్బు ఇవ్వలేదని..
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని దండోరా కాలనీలో నివాసముంటున్న గోవిందు (55) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. పెయింటింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. భార్య కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో తాగుడుకు బానిసైన గోవిందు... నిత్యం మద్యం మత్తులో జోగుతూ జులాయిగా మారాడు. మద్యం తాగేందుకు డబ్బు కావాలని సోమవారం సాయంత్రం భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఇవ్వక పోవడంతో రాత్రి గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.