
సారూ.. దృష్టి సారించండి
అనంతపురం అర్బన్: జిల్లాలో కీలకమైన శాఖ రెవెన్యూ. ఈ శాఖలో కొన్ని సమస్యలు పరిష్కారం కాక దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా చుక్కల భూముల ఫైళ్లు పరిష్కారానికి నోచుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎవరికీ అసైన్డ్ చేయని ప్రభుత్వ భూములను చుక్కల భూములుగా నమోదు చేస్తారు. ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు నిబంధనల ప్రకారం డి–పట్టా ఇస్తారు. ఇలా చుక్కల భూముల ఫైళ్లు 2,668 పెండింగ్‌లో ఉన్నాయి. డీఎల్‌సీ (డాటెడ్ ల్యాండ్ కమిటీ) సమావేశంలో ఈ ఫైళ్లను పరిశీలించి.. అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. నాగలక్ష్మి, గౌతమి కలెక్టర్లుగా పనిచేసిన కాలంలో ప్రతి డీఎల్‌సీ సమావేశంలో 150 నుంచి 200 ఫైళ్లు పరిష్కారమయ్యేవి. గత కలెక్టర్ హయాంలో ఫైళ్ల పరిష్కారం నత్తనడకన సాగింది.
జేఏలకు పదోన్నతి కల్పనలో జాప్యం
ఇక జూనియర్ అసిస్టెంట్‌లకు సీనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పించడంపై ఏడాదిన్నరగా జాప్యం చేస్తూ వచ్చారు. రెవెన్యూ శాఖలో 32 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతికి అర్హతలు ఉన్నజూనియర్ అసిస్టెంట్‌లు 30 మంది ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకోవడంతో సర్వీసు పరంగా జూనియర్ అసిస్టెంట్‌లు నష్టపోతున్నారు. విచిత్రం ఏంటంటే అనంతపురం జిల్లాలో మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ జేఏలకు ఎస్‌ఏలుగా పదోన్నతి ప్రక్రియ ఏడాది క్రితమే పూర్తవడం.
మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలన
జిల్లాలోని నాలుగు మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు మండలంలో ఏడాదిగా తహసీల్దారు స్థానం ఖాళీగా ఉంది. అదే విధంగా తాడిపత్రి, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో తహసీల్దారు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక అనంతపురం, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో డీఏఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కలెక్టరేట్‌లోని భూసంస్కరణల విభాగం సూపరింటెండెంట్ స్థానం ఖాళీగా ఉంది. సీనియర్ డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా అడహాక్ పదోన్నతి కల్పించి ఖాళీ స్థానాలో పోస్టింగ్ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో చాలాసార్లు డీటీలకు అడహాక్ పదోన్నతి కల్పిస్తూ ఖాళీగా ఉన్న మండలాలకు తహసీల్దార్లుగా నియమించారు. గత అధికారులు ఈ అంశంపై దృష్టిపెట్టకుండా ఇన్‌చార్జ్ పాలనకే మొగ్గుచూపారు.
పనులు చేయించుకుని..
కలెక్టరేట్, కలెక్టర్ క్యాంపు కార్యాలయం (బంగ్లా)లో సుందరీకరణ పనులు చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు రూ.70 లక్షలకు పైగా బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఏడాది దాటినా బిల్లులు రాకపోవడంతో వారు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ పనులను ప్రొసీడింగ్ కానీ, వర్కర్ ఆర్డర్ కానీ ఇవ్వకుండా చేయించారు. కలెక్టర్ మారడంతో ఆ బిల్లులు వస్తాయా.. రావా అని కాంట్రాక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు.
పరిష్కారానికి నోచుకోని 2,668 ‘చుక్కల’ ఫైళ్లు
ఏడాదిన్నరగా జేఏల పదోన్నతులు పెండింగ్
ఏడు చోట్ల భర్తీ కాని తహసీల్దార్ పోస్టులు
నేడు విధులకు హాజరుకానున్న కలెక్టర్ ఆనంద్