
తల్లడిల్లిన ఉల్లి రైతు
గుమ్మఘట్ట: ధర గిట్టుబాటు కాకపోవడంతో ఉల్లి పంటను రైతు దున్నేశాడు. జె.వెంకటం పల్లికి చెందిన రైతు అనంతరెడ్డి తనకున్న 2.5 ఎకరాల్లో రూ.2 లక్షల పెట్టుబడి పెట్టి ఉల్లి సాగు చేశాడు. ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి బహిరంగ మార్కెట్‌లో ధరలు పడిపోయాయి. 60 కిలోల బస్తా రూ.200 మాత్రమే పలకడంతో ఇది ఏమాత్రమూ గిట్టుబాటు కాదని రైతు తన పంటను ట్రాక్టర్ రోటోవేటర్ సాయంతో దున్నేశాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని ఉల్లి రైతులు కోరుతున్నారు.
ఆ తల్లి నిర్ణయం..
ఆరుగురికి వరం
● ఒక్కగానొక్క కుమారుడి బ్రెయిన్‌డెడ్
● అవయవ దానానికి తల్లి అంగీకారం
చిలమత్తూరు:
ఒక్కగానొక్క కుమారుడు. బిడ్డకు మూడు నెలల వయసులోనే భర్త మరణించాడు. అయినా కష్టాలకు ఎదురీది కుమారుణ్ని కంటికి రెప్పలా చూసుకుంది. ఇరవై ఏళ్లు నిండాయి. ఇంటికి పెద్దదిక్కుగా నిలుస్తాడనుకుంది. అయితే విధి మరొకటి తలచింది. కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. ఈ బాధ ఆ తల్లి గుండెను పిండేసింది. ఇంతటి దుఃఖంలోనూ కుమారుడి అవయవదానానికి అంగీకరించింది. వివరాల్లోకి వెళితే... చిలమత్తూరులో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, తుమ్మలకుంటకు చెందిన నవీన్‌తో పాటు మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. నవీన్‌ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. ఆసుపత్రి వర్గాలు నవీన్ తల్లి గీతతో మాట్లాడి కుమారుడి అవయవాలు దానం చేయాలని అభ్యర్థించారు. ఇందుకు ఆమె అంగీకరించింది. తన బిడ్డ భౌతికంగా దూరమైనా అవయవ దానంతో సజీవంగా ఉంటాడని భావించింది. గుండె, కళ్లు, లివర్, కిడ్నీలను దానం చేసింది. వాటిని వైద్యులు ఆరుగురికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు. ఈ విషయం తెలిసిన పలువురు గీతను ప్రశంసిస్తున్నారు.

తల్లడిల్లిన ఉల్లి రైతు