
ఒక రైతుకు ఒక బస్తానే!
● యూరియా కోసం రైతుల అవస్థలు
● ఈ– క్రాప్ బుకింగ్‌చేసుకున్నవారికేనని మెలిక
కళ్యాణదుర్గం: తగినంత నిల్వలు ఉన్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం యూరియా అందడం లేదు. అవసరాలకు అనుగుణంగా కాకుండా ఒక రైతుకు ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అధిక శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పంటలకు అవసరమైన యూరియా సకాలంలో సరఫరా కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి, పాలవాయి, గోళ్ల గ్రామాల్లోని రైతు సేవ కేంద్రాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. యూరియా కోసం రైతులు ఉదయం ఆరు గంటలకే పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, నీళ్ల బాటిళ్లను క్యూలో ఉంచారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు ఒక రైతుకు ఒక బస్తా.. అదీ యూరియా అవసరమైన మొక్కజొన్న, అరటి, టమాట తదితర పంటలను ఈ–క్రాప్ బుకింగ్ చేసుకున్నవారికే ఇస్తామని చెప్పారు. యూరియా ఇవ్వడానికి పిలిచి ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ అంటూ మెలికలు పెట్టడమేంటని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. బుకింగ్ చేసుకోని వారు అసంతృప్తితో వెనుదిరగాల్సి వచ్చింది.
స్టాకు వివరాలు వెల్లడించని అధికారులు
కళ్యాణదుర్గం వ్యవసాయ డివిజన్‌లో ఏ రైతు సేవ కేంద్రానికి ఎంత యూరియా వచ్చిందని ఏడీఏ యల్లప్పను ‘సాక్షి’ అడగ్గా.. ఆయన వివరాలు చెప్పడానికి నిరాకరించారు. ఏఓను అడగాలని, లేదా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసి అడిగినా యూరియా స్టాకు వివరాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం విమర్శలకు తావిస్తోంది.

ఒక రైతుకు ఒక బస్తానే!